IPL 2025 Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న జట్లు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్. కెరీర్ లో ఒక్క టైటిల్ కూడా సాధించకపోయినా.. విరాట్ కోహ్లీ మేనియాతో అదే రేంజులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కూడా భారీ అభిమానగణం సంపాదించుకుంది. మరి ఈ మూడు జట్ల తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు, మరీ ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టమైన జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్.
నిండుకుండలా..
అందుకే హైదరాబాద్ లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగిందంటే.. ఉప్పల్ స్టేడియం నిండు కుండలా మారిపోతుంది. తెలుగు క్రికెట్ అభిమానులతో స్టేడియం హోరెత్తిపోతుంది. కేరంతలు, ఈలలుతో దద్దరిల్లిపోతుంది. ముఖ్యంగా గత ఏడాది.. విధ్వంసం సృష్టిస్తూ, భారీ స్కోర్లను సాధిస్తూ.. రన్నరప్ గా నిలిచిన ఆ జట్టు.. ఈ సీజన్ లో మరింత విశేష అభిమాన ఆదరణ పొందింది.

వీరాభిమాని గిరి ప్రదిక్షణం..
అందుకే ఈ ఏడాది ఆ జట్టు టైటిల్ సాధించాలని సన్ రైజర్స్ అభిమానులంతా బలంగా ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ జట్టుకు చెందిన ఓ వీరాభిమాని చేసిన పని ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అతడు సన్ రైజర్స్ జెండాను ఒంటిపై ధరించి అరుణా చలం గిరి ప్రదక్షిణ చేస్తూ కనిపించాడు. సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ టైటిల్ సాధించాలని ఇలా చేస్తున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. మరి అతడు నిజంగానే సన్ రైజర్స్ గెలవాలని గిరి ప్రదిక్షిణ చేస్తున్నాడా? లేదంటే పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నాడా అనేది అతడికే తెలియాలి. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఆరెంజ్ ఆర్మా ఫారెవర్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ అయింది.
ఈ సారి తుస్సేనా..
కాగా, ఈ సారి 300 పక్కా అంటూ, ఈ సారి టైటిల్ సన్‌రైజర్స్‌దే పక్కా.. అంటూ ఐపీఎల్ 2025 బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆశించినంత స్థాయిలో ప్రదర్శన చేయట్లేదు. మొదటి మ్యాచులో గెలిచి.. విజయంతో ఘనంగా సీజన్‌ను ఆరంభించిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. ఆ తర్వాత ఆరో మ్యాచులో గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది. చూడాలి మరి తర్వాత ఆడబోయే మ్యాచుల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో, ప్లేఆఫ్స్ కు చేరుకుంటుందో లేదో..