టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. సోఫాలో కూర్చొని ఫొటోకు ఫోజుచ్చిన పంత్.. ఐపీఎల్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌బై పలకడం ఖాయమని, చెన్నై సూపర్ కింగ్స్‌లో పంత్ వెళ్తున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ పంత్ పెట్టిన ఫోజుకు అర్థం ఏంటని ఆలోచిస్తున్నారా?
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అనుకరిస్తూ సోఫాలో కూర్చొని పంత్ ఫొటోకు ఫోజిచ్చాడు. దానికి 'తలైవా' అని క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని సాధారణంగా చూస్తే ఎలాంటి భావం ఉండదు. కానీ సీఎస్కే, ధోనీ పోస్టులను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు లోతైన అర్థం తెలుస్తుంది. గతంలో ఇదే స్టిల్‌ను ఎంఎస్ ధోనీ పెట్టాడు. తలైవా స్టైల్‌లో కూర్చొని ఫొటో దిగాడు.

ఇప్పుడు సేమ్ టూ సేమ్ పంత్ దించేశాడు. దీంతో సీఎస్కేలోకి వస్తున్నట్లు పంత్ పరోక్షంగా వెల్లడించాడని చర్చ జోరుగా సాగుతోంది. గత కొన్ని నెలలుగా.. చెన్నై సూపర్ కింగ్స్‌లోకి పంత్ వస్తున్నట్లు, ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ రూల్స్‌పై క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన విడుదల అవుతుందని జాతీయ మీడియాలోనూ వార్తలు వచ్చాయి.
43 ఏళ్ల ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడటం అనుమానమే. అంతేగాక ధోనీకి భారీ మొత్తాన్ని వెచ్చించి రిటైన్డ్ చేసుకుంటే అది జట్టుపై ప్రభావం చూపుతుందని సీఎస్కే మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అయిదేళ్లు దాటిన ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించాలని ఐపీఎల్ మీటింగ్‌లో సీఎస్కే కోరింది.
దీన్ని ఇతర ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తుండటం, రిటైన్డ్ ప్లేయర్ల పరిమితి నలుగురు నుంచి అయిదుగురే అని ప్రచారం జరగనుండంటంతో ధోనీ ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై పలకడం ఖాయమనిపిస్తోంది. ఈ తరుణంలో పంత్ పోస్ట్ సీఎస్కే అభిమానులను ఉత్సాహపరుస్తోంది. మరోవైపు ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచ్ రికీ పాంటింగ్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. కప్ కలను నెరవేర్చుకోవాలని కసిగా ఢిల్లీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు చేయాలని ఫ్రాంచైజీ భావిస్తే పంత్ సీఎస్కే వెళ్లడం దాదాపు ఖాయమే.