IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన ఐపీఎల్ 2025లో కొనసాగుతోంది. రిషబ్ పంత్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. అతడిని లక్నో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ 19 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్ వెంటనే ఔటయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. రిషబ్ పంత్ పేలవమైన లక్నో జట్టుపై కూడా ప్రభావం చూపింది. ఆ జట్టు ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 7వ స్థానంలో ఉంది. చాలా మంది అభిమానులు లక్నో కెప్టెన్సీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా రిషబ్ పంత్‌కు మద్దతు ఇచ్చారు. కానీ అభిమానులు పంత్ కెప్టెన్సీ, ధరను ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అయ్యే సామర్థ్యం ఉన్న చాలా మంది ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
ఐడెన్ మార్‌క్రమ్‌కు కెప్టెన్ అయ్యే అవకాశం
లక్నో కెప్టెన్ కావడానికి ఐడెన్ మార్‌క్రమ్ బలమైన పోటీదారుడిగా ఉన్నాడు. ఐడెన్ మార్‌క్రమ్ 2024లో దక్షిణాఫ్రికాను టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు తీసుకెళ్లాడు. అతడికి వివిధ ఫార్మాట్లు, లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. ఐడెన్ మార్‌క్రమ్ 2014లో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టు ప్రపంచ కప్ గెలవడానికి నాయకత్వం వహించాడు. ఐడెన్ మార్‌క్రమ్ 2023,2024లో రెండు సార్లు సన్‌రైజర్స్ ఈస్టర్స్ కేప్‌ను SA20 (సౌతాఫ్రికా ప్రీమియర్ టీ20 క్రికెట్ లీగ్) టైటిల్ కు నడిపించాడు. 2024లో అతని కెప్టెన్సీలో ఆ జట్టు SA20 ఫైనల్ కు చేరుకుంది. అయితే 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అతని ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం బాగా లేదు. వారు 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచారు. కానీ టీ20ల్లో అతని కెప్టెన్సీ రికార్డు బాగుంది. ఐడెన్ మార్‌క్రమ్ గెలుపు శాతం 46 శాతంగా ఉంది.

మిచెల్ మార్ష్ కూడా బలమైన పోటీదారుడే..
మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్. జట్టును నడిపించడంలో అతనికి చాలా అనుభవం ఉంది. 2023లో ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినుప్పటి నుంచి మిచెల్ మార్ష్ మంచి రికార్డును కలిగి ఉన్నాడు. 2010లో ప్రపంచ కప్ గెలవడానికి మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియన్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు. బీబీఎల్ మ్యాచ్‌లలో పెర్త్ స్కార్చర్స్‌కు కూడా మిచెల్ మార్ష్ నాయకత్వం వహించాడు. ఈ ఆల్‌రౌండర్ 2017-18లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను మార్ష్ కప్ టైటిల్ కు కూడా నడిపించాడు. ఐపీఎల్ వేలంలో మిచెల్ మార్ష్‌ను రూ.3.4 కోట్లకు కొనుగోలు చేశారు. మిచెల్ మార్ష్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. మిచెల్ మార్ష్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్థ సెంచరీలతో సహా 184 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ స్థానంలో 33 ఏళ్ల మార్ష్ జట్టుకు మంచి కెప్టెన్‌గా నిరూపించుకోగలడు. మిచెల్ మార్ష్‌కు మంచి కెప్టెన్సీ అనుభవం ఉంది. మిచెల్ మార్ష్ మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు.
నికోలస్ పూరన్ కూడా..
నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.21 కోట్లకు నిలుపుకుంది. నికోలస్ పూరన్ కూడా కెప్టెన్సీకి పోటీదారుడు. గత సంవత్సరం కేఎల్ రాహుల్ లేనప్పుడు లక్నో జట్టుకు నాయకత్వం వహించాడు. అతను వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. గత సీజన్ లో అతను 62 సగటుతో, 178 స్ట్రైక్ రేట్ తో 499 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. 2024లో టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 68 మ్యాచ్‌ల్లో 2251 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా నికోలస్ పూరన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గతన నాలుగు మ్యాచ్‌ల్లో పూరన్ 201 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ఇటీవల నికోలస్ పూరన్ ఐఎల్టీ20 2025 సీజన్ లో ఎంఐ ఎమిరేట్స్ కు నాయకత్వం వహించాడు. ఆ జట్టు ఎలిమినేటర్‌కు చేరుకుంది.
కొనసాగుతున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ రిషభ్ పంత్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. కనీసం తాజాగా లక్నోలోని ఎకెనా క్రికెట్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులోనైనా రాణిస్తాడనుకుంటే... మళ్లీ అదే తంతు కొనసాగించాడు.ఆరు బంతులను ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు రిషభ్ పంత్. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులంతా పంత్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గ్యాప్ లేకుండా మీమ్స్ రూపంలో ఓ ఆటాడేసుకుంటున్నారు.అసలే ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు (రూ.27 కోట్లు) ధరకు రిషభ్ పంత్ ను దక్కించుకుని మరీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది లక్నో యాజమాన్యం. అయితే అతడు మాత్రం ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా రెండింటిలోనూ విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో పంత్ నాలుగు మ్యాచుల్లో చేసిన మొత్తం పరుగులు 19 మాత్రమే. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అతడు ఆ తర్వాత మ్యాచ్‌ల్లో 15, 2 , 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.