దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘూటుగా బదులిచ్చాడు. కేవలం డబ్బు కోసమే తాను ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టలేదని పంత్ పేర్కొన్నాడు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా వేలంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్-ఆక్షన్ గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్-పంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
''ఐపీఎల్ మెగా వేలం భిన్నమైనది. అది ఎలా సాగుతుందో తెలియదు. అయితే రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోవాలని భావిస్తున్నా. కొన్నిసార్లు ఓ ఆటగాడిని ఓ ఫ్రాంచైజీ ఫీజుల ఆధారంగా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఆటగాళ్లు మొదటి ప్రాధాన్యత రుసుము కంటే ఎక్కువ ఆశిస్తూ వేళానికి వెళ్లొచ్చు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా పంత్‌ను తిరిగి సొంతం చేసుకుంటుందని భావిస్తున్నా''

''ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ కూడా కావాలి. పంత్ జట్టులో లేకపోతే, వాళ్లు సారథిని వెతుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి పంత్ కోసం ఢిల్లీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా అప్‌లోడ్ చేసింది. దానికి పంత్ ట్విటర్‌లో రియాక్ట్ అయ్యాడు. ''నా రిటెన్షన్ గురించి తీసుకున్న నిర్ణయం కచ్చితంగా డబ్బు గురించి అయితే కాదు'' అని పంత్ కామెంట్ చేశాడు.
రూ.2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌కు వస్తున్న పంత్ మెగా వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతని కోసం ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వికెట్ కీపింగ్‌తో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించే సామర్థ్యం ఉన్న రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకున్న విషయం తెలిసిందే. రూ.47 కోట్లు వెచ్చించి అక్షర్ పటేల్ (రూ.16.50 కోట్లు), కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు) రిటైన్ చేసుకుంది. మిగిలిన రూ.73 కోట్లతో ఢిల్లీ 21 ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా, 2016లో అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు పంత్ ఢిల్లీ తరఫునే కొనసాగాడు.