CSK vs LSG: ఐపీఎల్ 2025లో 30వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై అద్భుతంగా ఆడి లక్నోను 5 వికెట్లు తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అత్యధికంగా 63 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా, మతిషా పతిరానా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరొక వికెట్ పడగొట్టారు. 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. " ఒక జట్టుగా మేము 10 నుంచి 15 పరుగులు తక్కువ స్కోర్ చేశామని భావిస్తున్నాను. మా జట్టు మంచి దూకుడు మీద ఉన్నప్పుడు కూడా వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. దీని కారణంగా మేము మంచి భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయాం. పిచ్ లో ఎలాంటి లోపం లేదు. కానీ మా జట్టు ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. కొన్ని బంతులు అడపాదడపా వస్తున్నాయి. మేము ఇంకా 10 పరుగులు చేసి ఉండాలి.. అప్పుడు మేము మ్యాచ్ పై పట్టు బిగించేవాళ్లం. ప్రతి మ్యాచ్ లో నేను మెరుగ్గా ఉన్నాను. కానీ కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా మంచి ఫలితాలు రావడం లేదు. నేను నెమ్మదిగా నా ఫామ్ లోకి తిరిగి వచ్చి ప్రతి మ్యాచ్ పై దృష్టి సారిస్తున్నాను" అని రిషబ్ పంత్ అన్నాడు.

బిష్ణోయ్ గురించి పంత్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ లో బిష్ణోయ్ కి ఎక్కువ ఓవర్లు ఇవ్వలేకపోయాం. చివరి ఓవర్ బౌలింగ్ చేయలేకపోయాం. పవర్ ప్లేలో మా బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. కానీ మేము దానిని మెరుగుపరచుకోవచ్చు. మేము ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక దానిని నేర్చుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్తులో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తాం."అని రిషబ్ పంత్ అన్నాడు.