ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తన చర్యలను వేగవంతం చేసింది. రిటైన్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసిన ఢిల్లీ ఫ్రాంచైజీ.. కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్లేయర్లతో పాటు ఓ అన్‌క్యాపడ్ ప్లేయర్‌ను తమ ఫ్రాంచైజీతోనే కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించిందని సమాచారం.
నవంబర్ మూడు లేదా ఆఖరి వారంలో మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా విదేశాల్లో మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-17వ సీజన్‌కు గత డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా వేలం జరిగింది. అయితే ఈ సారి అబుదాబి లేదా లండన్ వేదికగా ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రిటెన్షన్ రూల్స్‌పై ఈ నెలాఖరులోపు స్పష్టత రానుంది.

రిటెన్షన్ నిబంధనలు ఖరారు కాకముందే ఢిల్లీ క్యాపిటల్స్ తమ జాబితాను దాదాపుగా సిద్ధం చేసింది. రిటెన్షన్ జాబితాలో తమ ప్రథమ ఎంపిక రిషభ్ పంత్‌గా నిర్ణయించుకుంది. ప్రస్తుతం పంత్ ఐపీఎల్ జీతం రూ.16 కోట్లు. అయితే బీసీసీఐ నిర్దేశించిన రిటెన్షన్ ఫీజు ఆధారంగా పంత్‌కు మరింత మొత్తాన్ని అందించడానికి ఢిల్లీ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది. ఇటీవల దీనికి సంబంధించిన విషయం గురించి ముంబైలో ఫ్రాంచైజీ సహయజమాని పార్త్ జిందాల్‌తో పంత్ చర్చించాడు.
రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ ఐపీఎల్-2023 సీజన్‌కు దూరమైనప్పటికీ గత సీజన్‌లో పూర్తిస్థాయిలో కెప్టెన్, వికెట్ కీపర్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 155 స్ట్రైక్‌రేటుతో 446 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక పంత్‌తో పాటు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించింది. అయితే ఓవర్సీస్ ప్లేయర్లు, అన్‌క్యాపడ్ ప్లేయర్ల గురించి నిబంధనలు ఖరారైతే.. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.
ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్, దక్షిణాఫ్రికా చెందిన స్టబ్స్ విధ్వంసకర బ్యాటర్లు. పోరెల్ భారత యువ వికెట్ కీపర్. దేశవాళీలో సత్తాచాటుతున్నాడు. పంత్‌కు బ్యాకప్ కీపర్‌గా ఉండటమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలడు. దీంతో ఈ అన్‌క్యాపడ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తోంది.