రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిటెన్షన్ రూల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు. ఇందులో విదేశీ ప్లేయర్లకు ఎలాంటి పరిమితి లేదు. అంటే మొత్తం అయిదుగురు ఫారెన్ ప్లేయర్లను (క్యాప్డ్ ప్లేయర్ల రూల్‌తో) కూడా అట్టిపెట్టుకోవచ్చు.

అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు నిర్వచనం ఏంటంటే..
''ఓ భారత ప్లేయర్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఇలా పరిగణిస్తారు. గత అయిదేళ్ల క్యాలెండ్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లో అయినా తుదిజట్టులో కూడా చోటు దక్కించుకోని ఆటగాళ్లు, అలాగే ఆ సదరు ప్లేయర్లు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రక్ట్ కూడా లేకుండా ఉంటే అన్‌క్యాప్డ్‌గా పరిగణిస్తారు. ఇది భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది''
ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. రిటెన్షన్ స్లాబ్‌ల ద్వారా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే రూ.75 కోట్లు చెల్లించాలి. మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను కూడా తమ ఫ్రాంచైజీతో కొనసాగించాలంటే రూ. 4 కోట్లు వెచ్చించాలి. అయితే ఆ సందర్భంలో సదరు ఫ్రాంచైజీ రూ.41 కోట్లతోనే మెగా వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.
ఆర్‌టీఎమ్‌లో మార్పు ఇదే
రిటెన్షన్ ధరకు బదులుగా వేలంలో ప్లేయర్లను ఎలాంటి పరిమితి లేకుండా నిబంధనలకు అనుగుణంలో ఆర్‌టీఎమ్‌తో దక్కించుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ సారి ఆర్‌టీఎమ్ రూల్స్‌లో ఓ మార్పు ఉంది. బిడ్ వేసిన ప్రాంఛైజీ సదరు ఆటగాడిని దక్కించుకోవడానికి మరోసారి బిడ్ వేసే అవకాశం ఇవ్వనున్నారు. ఉదాహరణకు సీఎస్కే ప్లేయర్‌ను ఆర్సీబీ రూ.15 కోట్లుకు వేలంలో సొంతం చేసుకుంది. ఆ సదరు ప్లేయర్‌ను సీఎస్కే తమ దగ్గర అందుబాటులో ఉన్న ఆర్‌టీఎమ్‌తో రూ.15 కోట్లు చెల్లించి తీసుకుంటామని ముందుకు రావచ్చు.
అయితే సీఎస్కే అలా ముందుకు వచ్చిన సందర్భంలో.. ఆర్సీబీ ధరను మరింత పెంచుతామని వేలాన్ని కొనసాగించవచ్చు. అప్పుడు రూ.20 కోట్లు ధర పలికాడని అనుకుందాం. అప్పటికే ఆ ఆటగాడిని సీఎస్కే దక్కించుకోవాలంటే గరిష్టంగా పలికన రూ.20 కోట్లను వెచ్చించాల్సి ఉంటుది. లేదంటే రూ.20 కోట్లకు ఆ ప్లేయర్ ఆర్సీబీకి వెళ్తాడు.
ఫ్రాంచైజీల రిటైన్ లిస్ట్ ప్రకటన లైవ్ ఫ్రీగా చూడాలంటే?
రిటెన్షన్‌కు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఫ్రీగా చూడవచ్చు. గురువారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం అవుతుంది.