ఐపీఎల్‌లో 17 సీజన్లు ముగిశాయి. ప్రతి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. కానీ కప్ కల కలగానే మిగిలిపోతుంది. వరల్డ్ స్టార్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు జట్టును బలోపేతం చేయాలని, దాని కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ భావిస్తోంది.
మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీలన్ని రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై దృష్టిసారించాయి. బీసీసీఐ రిటెన్షన్ పాలసీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గరిష్టంగా నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీ.. తమ కెప్టెన్ డుప్లెసిస్‌తో సహా స్టార్ ఆటగాళ్లను విడిచిపెట్టి, కొత్త జట్టును నిర్మించాలని భావిస్తోంది. వదులుకునే ఆటగాళ్లలో టాప్-3 వీళ్లే..

డుప్లెసిస్‌కు గుడ్‌బై
సౌతాఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్‌కు గుడ్‌బై చెప్పాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. ఐపీఎల్‌లో డుప్లెసిస్‌కు అపారనుభవం ఉంది. ఈ కారణంతో 2022లో ఆర్సీబీ తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించి జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. డుప్లెసిస్ మూడు సీజన్లలో రెండు సార్లు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటు, ఫీల్డింగ్‌తో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 468, 730, 438 పరుగులతో గత సీజన్లలో ఫర్వాలేదనిపించాడు. కానీ 40 ఏళ్ల డుప్లెసిస్ స్థానంలో యువకుడి అవకాశం కల్పించాలని, కొత్త వ్యక్తికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

మాక్సీ స్థానంలో విల్ జాక్స్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ మాక్స్‌వెల్‌ను వదులుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. 2021లో ఆర్సీబీలోకి వచ్చిన మాక్సీ ఆ సీజన్‌లో 513 పరుగులతో అలరించాడు. ఆ తర్వాత 301, 400 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ 2024 సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 5 సగటుతో కేవలం 52 పరుగులే చేశాడు. 36 ఏళ్ల మాక్సీ కోసం వెచ్చించే రూ.11 కోట్లను ఇతర ప్లేయర్లపై ఉపయోగిస్తే జట్టుకు ప్రయోజనం చేకూరుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. కాగా, మాక్సీని వదులుకోవడానికి మరో కారణం.. యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ మెరుగైన ప్రదర్శన చేయడమని తెలుస్తోంది.
గ్రీన్‌కు టాటా
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీ వదులుకోవాలని నిర్ణయించుకుంది. గ్రీన్ గేమ్ ఛేంజర్‌గా మారతాడని ముంబై ఇండియన్స్ నుంచి బెంగళూరు ట్రేడ్ చేసుకుంది. కానీ రూ.17.50 కోట్లు విలువైన గ్రీన్ అంచనాలను అందుకోలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 255 పరుగులు, 10 వికెట్లతో సాధారణ ప్రదర్శన చేశాడు. దీంతో గ్రీన్‌ను విడిచిపెట్టాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే వేలంలో తక్కువ ధరకు సొంతమైతే తిరిగి ఫ్రాంచైజీలోకి ఆహ్వానించే ఆలోచనతోనూ ఆర్సీబీ ఉంది.