IPL 2025 Virat Kohli: ఐపీఎల్‌లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్.. తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం రోజులను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు తాను ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు, గేమ్ ఛేంజిగ్ మూమెంట్స్ ఏంటి, ఇన్నేళ్లలో ఐపీఎల్ తనను ఓ మంచి ప్లేయర్ గా ఎలా తీర్చిదిద్దింది వంటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ గురించి కూడా మాట్లాడాడు.
అప్పుడు ఐపీఎల్ చూసి ఆశ్చర్యపోయా..
"ఐపీఎల్‌లో తొలిసారి ఆడినప్పుడు, పూర్తి ఆశ్ఛర్యానికి గురయ్యాను. అప్పటివరకు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ తప్ప.. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి జాతీయ స్థాయి దిగ్గజ క్రికెటర్స్ ను ఎప్పుడూ కలవలేదు. దీంతో వారున్న డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడం నాకు ఓ కలల ప్రపంచంలా అనిపించింది. అయితే ఆ ఉత్సాహంతో పాటు ఒత్తిడి కూడా వచ్చింది. అప్పుడు నా ఆట స్థాయి, వాళ్ల రేంజ్ లో లేదని నాకు తెలుసు. కాబట్టి నేనెంటో నిరూపించుకోవాలి. ఆ ఒత్తిడే తొలి సీజన్‌లో నాకు కాస్త ఇబ్బందిగా మారింది. ఇప్పటికీ ఆ అనుభవం మర్చిపోలేనిది" అని విరాట్ కోహ్లీ అన్నాడు.
అప్పుడే మలుపు తిరిగింది..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తన ప్రారంభ రోజులకు గుర్తుచేసుకున్నాడు విరాట్ కోహ్లీ. బ్యాటింగ్ ఆర్డర్‌లో నిలకడ స్థానం దొరికాకే, తన కెరీర్ మలుపు తిరిగిందని వివరించాడు. "ఆర్సీబీ తరఫున మొదటి మూడేళ్లలో నాకు టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశాలు తక్కువగా వచ్చాయి. నన్ను లోయర్ ఆర్డర్ లో పంపేవారు. అందుకే,అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆ సమయంలో ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాను. కానీ 2009 సీజన్ నాకు కాస్త మంచిగా అనిపించింది. ఆ సీజన్ లో పిచ్‌లు నా ఆటకు అనుకూలంగా ఉండేది. బంతి బ్యాట్‌పైకి బాగా వచ్చేది. అందుకే నేను మరింత స్వేచ్ఛగా షాట్లు ఆడాను. నా కెరీర్‌లో అది కచ్చితంగా ఓ ఆసక్తికరమైన దశ. 2010 నుంచి నేను మరింత స్థిరంగా ప్రదర్శన చేయడం ప్రారంభించాను. 2011 సీజన్ నాటికి నేను రెగ్యులర్‌గా నెం.3లో బ్యాటింగ్ చేయడం ప్రారంభించాను. అప్పుడే నా ఐపీఎల్ కెరీర్ మలుపు తిరిగింది. " అని కోహ్లీ వివరించాడు.

ఇగో కాదు, అదే నాకు ముఖ్యం..
రీసెంట్ గా ఓ మ్యాచులో తనకు సెంచరీ చేసే అవకాశం ఉన్న.. జట్టు కోసం 97 నాటౌట్ ప్రదర్శన చేశాడు శ్రేయస్ అయ్యర్. దీంతో అతడిపై ప్రశంసలు కురిశాయి. వ్యక్తిగత ప్రదర్శన కన్నా, జట్టు కోసం ఆడటమే అసలైన నాయకుడి లక్ష్యమని అయ్యర్ ను ప్రశంసించారు. అదే సమయంలో.. కోహ్లీ మాత్రం అలా కాదని, వ్యక్తిగత ప్రదర్శన కోసం ఆడుతాడని విమర్శలొచ్చాయి. ఇప్పుడు దాని గురించే విరాట్ పరోక్షంగా మాట్లాడాడు. క్రికెట్ లో ఇగో పనికిరాదని అన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కన్నా, మ్యాచ్ పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం తనకు ముఖ్యమని చెప్పాడు కోహ్లీ. ఎప్పుడు కూడా జట్టు కోసమే తాను ఆడినట్లు అన్నాడు.
"ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో చూస్తే ఇది అర్థమవుతుంది. ఓ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బాధ్యత తీసుకుని, ముందుండి ఆడాడు. ఇక్కడ ఈగో(అహం) గురించి మ్యాటర్ కాదు. ఆ సమయంలో నేను గేమ్‌లో రిథమ్‌లో ఉండి ఉంటే, నేను ముందడుగు వేసి బాధ్యత తీసుకుని మరింత ఆడేవాడిని. నిర్ణయాలు తీసుకునే వాడిని. ఎవరూ ఫ్లోలో ఉంటే వారు ముందుంటారు అంతే. అయితే ఇది మరో ఆటగాడిని అధిగమించాలని కాదు. అలా అని నా దగ్గర ప్రతిభ లేదని కూడా కాదు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లడమే నాకు ముఖ్యం. అదే నేను ఎప్పుడూ గర్వంగా భావిస్తాను." అని విరాట్ చెప్పుకొచ్చాడు.