IPL 2025 RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన, విజయాలు చూస్తుంటే.. ఈ సీజన్ లో ఆ జట్టు కప్పు కొట్టేలా కనిపిస్తోంది. 18 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐపీఎల్ ట్రోఫీ.. వారి చెంతకు చేరేలా కనిపిస్తోంది. ఆర్సీబీ అభిమానులంతా ప్రస్తుతం ఇదే ధీమాలో ఉన్నారు. తాజాగా జరిగిన తీవ్ర ఉత్కంఠ మ్యాచ్‌లోనూ సీఎస్కేపై గెలిచిన ఆర్సీబీ.. తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5×4, 5×6), జాకబ్ బెతెల్ (33 బంతుల్లో 55; 8×4, 2×6), రొమారియో షెఫర్డ్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4×4, 6×6) మెరుపులు మెరిపించడంతో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో పతిరన (3/36) మెరిశాడు. ఆ తర్వాత ఆయుష్ మాత్రే (48 బంతుల్లో 94; 9×4, 5×6), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8×4, 2×6) అద్భుతంగా రాణించడంతో చెన్నై జట్టు విజయానికి చేరువగా వెళ్లింది. కానీ ఆఖరి ఓవర్లలో ఎంగిడి (3/30), యశ్ దయాళ్ (1/41) మాయ చేయడంతో ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. 11 మ్యాచులు ఆడగా.. ఆర్సీబీకి ఇది 8వ విజయం కావడం విశేషం.

అర్ధరాత్రి 12.30గ రోడ్లపై..
దీంతో తమ అభిమాన జట్టు విజయం సాధించడంపై ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నస్వామి స్టేడియం మొత్తం, మైదానం పరిసరాల్లో, రోడ్లంతా ఆర్సీబీ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. వారి కేరింతలతో హోరెత్తిపోయింది. రాత్రి 12.30 అయినా అభిమానులు ఇంటికి తిరిగి వెళ్లకుండా, ఆర్సీబీ ఆటగాళ్ల బస్సు వెనకాలే తిరుగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు చేతులూపుతూ, జెండాలు ఊపుతూ అభినందనలు తెలిపారు. దారి పొడవునా కి.మీ. మేర బారులు తీరి, కేరింతలు కొడుతూ ఈలలు గోలలతో రచ్చ రచ్చ చేశారు. పోలీసులు కూడా వారిని అదుపు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మ్యాచ్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్ రజత్ పటీదార్.. విజయానికి గల కరాణాలు తెలిపాడు.
నమ్మలేకపోతున్నా.. ట్రోఫీ గెలిచి తీరుతాం..
ఆ తర్వాత కృనాల్ పాండ్య మాట్లాడుతూ.. "అన్ బిలీవబుల్ మ్యాన్. అన్ బిలీవబుల్. నమ్మలేకపోతున్నా. ఏం ముంది ఈ ఫీలింగ్. అభిమానులు చాలా క్రేజీ. ప్రజల అభిమానం చూస్తుంటే.. మేమే అదృష్టవంతులు కాదా. మాకు ఆ దేవడు అవకాశం ఇచ్చాడు. ఈసారి మేం ట్రోఫీ గెలిచి తీరాలి. ఒకసారి ఆ ట్రోఫీ మేం గెలిస్తే.. ఏమవుతుందో మీరే ఊహించుకోండి!" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.