ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ సారైనా కప్‌ను సాధించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదునైన వ్యూహాలతో మెగా ఆక్షన్‌లో బరిలోకి దిగుతోంది.
ఆర్సీబీ రూ.37 కోట్లు వెచ్చించి విరాట్ కోహ్లి (21), రజత్ పటిదార్ (11), యశ్ దయాల్ (5)లను రిటైన్ చేసుకుంది. అయితే తమ పర్స్‌లో మిగిలిన రూ.83 కోట్లతో దాదాపు 22 మందిని వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంది.అందులో గరిష్టంగా 8 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది. అయితే తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి ఆర్సీబీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇతర ఫ్రాంచైజీలతో పోటీ ఉన్నప్పటికీ, ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించలేని జట్ల మాజీ ప్లేయర్లపై ఆర్సీబీ గురిపెట్టింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ నలుగరు ఆటగాళ్లపై కన్నేసింది. తమ సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియానికి అనుగుణంగా సత్తాచాటే ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసుకోవాలనుకుంటుంది.

మార్కో జేన్సన్
శస్త్రచికిత్సతో వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండని కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీ వదులుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వెతుకుతోంది. దక్షిణాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్ మార్కో జేన్సన్‌ను తమ వ్యూహాలకు సరిపోతాడని భావిస్తోంది. బౌలింగ్‌తో పాటు ధనాధన్ బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం జేన్సన్ సొంతం. ఇటీవల భారత్‌తో జరిగిన మూడో టీ20లో జేన్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. దీంతో జేన్సన్‌పై ఆర్సీబీ కన్నేసింది.

నటరాజన్
భారత యువ లెఫ్టార్మ్ బౌలర్ నటరాజన్‌ను సొంతం చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇప్పటికే ఎడమచేతి వాటం బౌలర్ యశ్ దయాల్‌ను రిటైన్ చేసకున్నప్పటికీ, డెత్ ఓవర్లలో గొప్పగా బంతులు వేసే నటరాజన్ జట్టులో ఉండటం మంచిదని భావిస్తోంది. స్లో బంతులు, కచ్చితత్వంతో యార్కర్లు సంధించడంలో నటరాజన్ దిట్ట. అయితే నటరాజన్ కోసం వేలంలో విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాము నిర్ణయించుకున్న బడ్జెట్‌లో వస్తేనే నట్టూను తీసుకోవాలని చూస్తోంది.

వాషింగ్టన్ సుందర్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ అనంతంర వాషింగ్టన్ సుందర్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌ను సన్‌రైజర్స్ వదిలేయడంతో ఇతర ఫ్రాంచైజీలు దక్కించుకోవాని ఆరాటపడుతున్నాయి. అయితే తమ మాజీ ఆటగాడిని తిరిగి ఫ్రాంచైజీలోకి తీసుకురావడం కోసం ఆర్సీబీ భారీ మొత్తాన్ని వెచ్చించాలనుకుంటుంది. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో బంతితో సత్తాచాటడం, బ్యాటుతో చెలరేగడం సుందర్ ప్రత్యేకత.

షాబాజ్ అహ్మద్
స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను బ్యాకప్ ఆప్షన్‌గా ఆర్సీబీ పెట్టుకుంది. వేలంలో వాషింగ్టన్ సుందర్ దక్కించుకోలేని సందర్భంలో షాబాజ్‌ను సొంతం చేసుకోవాలని బెంగళూరు ఫ్రాంచైజీ భావిస్తోంది. ఎడమచేతి వాటం షాబాజ్ కూడా ఆర్సీబీ మాజీ ప్లేయరే. అలాగే నటరాజ్ దక్కని క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్ కోసం కూడా బిడ్ వేయాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది.