క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మెగా పండగ ఐపీఎల్ 2025 వచ్చేసింది. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుండగా.. ఇప్పటికే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్లు మైదానానికి చేరుకుని ప్రాక్టీస్ సెషన్ ను మొదలు పెట్టేశాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇప్పుడు ఆర్సీబీ ప్లేయర్స్ చిక్కులో పడే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం బీసీసీఐ రూల్స్‌ను బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఉల్లంఘించడమే.
ఇంతకీ ఏం జరిగిందంటే?
రీసెంట్‌గా బీసీసీఐ.. 10 పాయింట్లతో నియమావళిని రూపొందించి, ఆటగాళ్లు పాటించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. ఏ మ్యాచ్ కోసమైనా స్టేడియానికి జట్టు ఆటగాళ్లంతా ఒకే బస్సులో ప్రయాణించి, తిరిగి అదే బస్సులో అందరూ కలిసి వెళ్ళడం. ఎవరూ కూడా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించకూడదు. ఐపీఎల్ టీమ్ క్రికెటర్స్ కు కూడా ఇదే వర్తిస్తుందని సమాచారం. కానీ తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో అలా జరగలేదు.
కోహ్లీ కోసం ఎగబడ్డ జనం..
ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో అతడు మ్యాచ్ అయ్యాక బయటకు వెళ్లేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఓ దశలో అతడు టీమ్ బస్ కాకుండా, వ్యక్తిగత కారులో మైదానం వీడుతాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ విరాట్ చివరికి జట్టుతోనే కలిసి బస్సులో ప్రయాణించాడు. ఆ సమయంలో తన అభిమానులకు ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు.
రూల్స్ ఉల్లంఘించిన ఆ ముగ్గురు..
అయితే ఆర్సీబీ ప్లేయర్స్ కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హెజిల్‌వుడ్ బీసీసీఐ రూల్స్ ను ఉల్లంఘించారని తెలిసింది. వాళ్లు తిరిగి బయలుదేరేటప్పుడు టీమ్ బస్సులో కాకుండా కారులో వెళ్లారట. ఇది కాస్త కెమెరా కంటికి చిక్కింది. దీంతో వీరిపై ఇప్పుడు బీసీసీఐ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని క్రికెట్ అభిమానుల మదిలో ప్రశ్నలు మెదులుతున్నాయి.
