రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.
ఇందులో విదేశీ ప్లేయర్లకు ఎలాంటి పరిమితి లేదు. అంటే మొత్తం అయిదుగురు ఫారెన్ ప్లేయర్లను (క్యాప్డ్ ప్లేయర్ల రూల్‌తో) కూడా అట్టిపెట్టుకోవచ్చు. నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తమ రిటైన్ లిస్ట్‌ను సిద్ధం చేసింది. నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, యువ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్‌ను రిటైన్ లిస్ట్‌లో చేర్చింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఫ్రాంచైజీలో కొనసాగించనుంది. అయితే జోస్ బట్లర్, యుజువేంద్ర చాహల్ విషయంలో ఫ్రాంచైజీ సందిగ్ధతలో ఉంది.
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ బట్లర్ గత సీజన్‌లో 140 స్ట్రైక్‌రేటుతో 359 పరుగులు చేశాడు. మరోవైపు చాహల్ 9.41 ఎకానమీ రేటుతో 18 వికెట్లు తీశాడు. వీరిద్దరిలో ఒకరిని ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. అయితే బట్లర్‌కు బదులుగా చాహల్‌ను వేలంలో సొంతం చేసుకోవాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జట్టు విజయాల్లో చాహల్ కీలక పాత్ర పోషిస్తాడని, అతన్ని జట్టులో కొనసాగించాలని ద్రవిడ్ పట్టుబట్టినట్లు సమాచారం. 2022 వేలంలో చాహల్‌ను రాజస్థాన్ రూ.6.5 కోట్లకు సొంతం చేసుంది. 2022 సీజన్‌లో చాహల్ పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. అయితే చాహల్ వేలంలో వస్తే భారీ ధర పలికే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ రిటైన్డ్ లిస్ట్: సంజు శాంసన్, యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ.