IPL 2025: ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో చెన్నై, రాజస్థాన్ తర్వాత నిష్క్రమించిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.
టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. అనంతరం మ్యాచ్ రద్దు చేయబడింది. ఈ మ్యాచ్ రద్దు తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ప్రతి జట్టుకు ఎన్ని పాయింట్లు అవసరం?
సాధారణంగా 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. కానీ ఈ సారి 16 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం అంత సులభం కాదు. పాయింట్ల పట్టిక ఎంత ఓపెన్‌గా ఉందంటే.. చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ తప్ప ప్రతి జట్టు 16 పాయింట్లను చేరుకోగలదు. అటువంటి పరిస్థితిలో చివరికి మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్నవారు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తారు. కానీ జట్లు నెట్ రన్ రేట్ వలలో చిక్కుకోవడానికి ఇష్టపడవు. ఈ క్రమంలో వారు కనీసం 18 పాయింట్ల సాధించి ప్లేఆఫ్స్‌కు సులభంగా అర్హత సాధించాలని చూస్తారు. 18 పాయింట్లను చేరుకోవడానికి ప్రతి జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలో తెలుసుకుందాం.
*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -3 మ్యాచ్‌లలో ఒకటి గెలవాలి.
*పంజాబ్ కింగ్స్ - 3 మ్యాచ్‌లలో 2 (19 పాయింట్లకు చేరుకుంటుంది)
*ముంబై ఇండియన్స్ - 3 మ్యాచ్‌లలో 2
గుజరాత్ టైటాన్స్ - 4 మ్యాచ్‌లలో 2
ఢిల్లీ క్యాపిటల్స్ - 3 మ్యాచ్‌లలో 3 (19 పాయింట్లకు చేరుకుంటుంది)
ఈ ఐదు జట్లు తప్ప మరే ఇతర జట్టు 18 లేదా 19 పాయింట్లను చేరుకోవడం సాధ్యం కాదు. కోల్‌కతా 11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. లక్నో 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఇక్కడి నుంచి తమ అన్ని మ్యాచ్‌లను గెలిస్తే వారు వరుసగా 17, 16 పాయింట్లకు చేరుకుంటారు. రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది. కానీ అది అసాధ్యం కాదు.