MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అత్యంత కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 3 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. చివరి బెర్తు కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ నిర్ణయాత్మక మ్యాచ్ కానుంది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లేఆఫ్ స్థానం సొంతం అవుతుంది. ఢిల్లీ జట్టు పోటీ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఆ జట్టు అవకాశాలు మెరుగపడతాయి కానీ ప్లేఆఫ్ స్థానం ఖరారు కాదు. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టునే ఢికొనబోతున్నాయి. ముంబై జట్టు తమ సొంతగడ్డపై గెలిచి ఉత్కంఠ తెరదించుతుందా అనేది వేచి చూడాల్సిందే. ముంబే జట్టు ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం వెనుకబడి ఉంది. ముంబై గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఢిల్లీ క్యాపిటల్స్ అర్హత సాధించాలంటే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచినా.. ముంబై మరో మ్యాచ్‌లో ఓడిపోవాలని ప్రార్థించాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించొచ్చన్న హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్ రిజల్ట్ వస్తే సరే, లేదంటే చెరొక పాయింట్ లభిస్తుంది. అలా జరిగితే పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు నేడు ముంబైలో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముంబై, కొంకణ్ ప్రాంతంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం రాత్రి ముంబైలో భారీ వర్షం కురిసింది. దీని కారణంగా ఢిల్లీ ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేయలేకపోయింది.

ఆక్యూవెదర్ ప్రకారం మే 22న వర్షం పడే అవకాశం 80 శాతం ఉంది. ఉదయం 10 గంటలకు 62 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు 71 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు వర్షం పడే అవకాశం 49 శాతానికి తగ్గుతుంది. శుభవార్త ఏమిటంటే సాయంత్రం వాతావరణం బాగుంటుంది. సాయంత్రం 6 గంటలకు వర్షం పడే అవకాశం 16 శాతం మాత్రమే. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల మధ్య వర్షం పడే అవకాశం 7 నుంచి 8 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నారు.
బీసీసీఐ నిబంధనలో మార్పులు
వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిబంధనలలో మార్పులు చేసింది. ఐపీఎల్ గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లలో వర్షం పడితే ఒక గంట తర్వాత ఓవర్లు కుదించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దానిని రెండు గంటలకు పెంచారు. అంటే మ్యాచ్ 9.30కి ముందు ప్రారంభమైతే ఓవర్లలో ఎలాంటి తగ్గింపు ఉండదు.