R Ashwin: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే దిగ్వేష్ రతి మన్కడింగ్ వివాదం చాలా చర్చనీయాంశంగా మారింది. కొంత మంది అభిమానులు సోషల్ మీడియాలో దిగ్వేష్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే అప్పీల్ ఉపసంహరించుకోవాలనే నిర్ణయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి మన్కడింగ్ వివాదంపై తన స్పందనను తెలియజేశాడు.జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మొత్తం సంఘటనలో రిషబ్ పంత్ దిగ్వేష్‌కు మద్దతు ఇచ్చి ఉండాల్సిందని.. అతను తన సొంత బౌలర్‌ను అవమానించాడని అశ్విన్ అన్నాడు.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేష్ రతి మన్కడింగ్ చేశాడు. నాన్-స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న జితేష్ శర్మను ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతిని వేసే క్రమంలో ఆగిపోయి బంతిని వికెట్లకు కొట్టాడు. అయితే అప్పటికే జితేష్ శర్మ క్రీజుకు దూరంగా ఉన్నాడు. దిగ్వేష్ రతి అప్పీల్ చేయగా.. నిబంధనల ప్రకారం జితేష్ శర్మను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం వెలువడక ముందే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడని ప్రశంసల వర్షం కురిసింది.

అయితే రిషబ్ పంత్‌పై ఐపీఎల్‌లో తొలిసారి మన్కడింగ్ ను అమలు చేసిన స్టార్ బౌలర్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఇది బౌలర్ పరువు తీయడమేనని రిషబ్ పంత్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాడు.
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.." రిషబ్ పంత్ గొప్ప క్రికెటర్. అతను అద్భుతమైన సెంచరీ చేశాడు. పంత్ క్రికెట్‌లో ఇంకా చాలా గొప్ప విజయాలు సాధిస్తాడని నాకు తెలుసు. పంత్ అక్కడ ఎలా బ్యాటింగ్ చేస్తాడో, టీమిండియాను గెలిపిస్తాడో చూడడానికి నేను ఇప్పటికే ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాను. నేను పంత్ కు పెద్ద అభిమానిని. కానీ బౌలర్ దిగ్వేష్ రతి గురించి ఒక్కసారి ఆలోచించండి. దిగ్వేష్ చేసిన పనిని కోట్లాది మంది ప్రజల ముందు కెప్టెన్ తప్పుబట్టాడు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఏ కెప్టెన్ అయినా ఆటగాడికి మద్దతు ఇవ్వాలి.. ఇది బౌలర్‌కు ఘోరమైన అవమానమే. ఇలాంటి చర్యలతో బౌలర్ ను హర్ట్ చేశారు" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.