పంజాబ్ కింగ్స్ తమ కొత్త ప్రధాన కోచ్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ తమ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడని తెలిపింది. మరో నాలుగు సీజన్ల పాటు పాంటింగ్ తమ ఫ్రాంచైజీతో కొనసాగుతాడని బుధవారం వెల్లడించింది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ పాంటింగ్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు పాంటింగ్ ఏడేళ్లు కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. పాంటింగ్ కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2019, 2020, 2021 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అంతేగాక ఆ జట్టు తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. 2020లో టైటిల్ పోరుకు వెళ్లిన ఢిల్లీ రన్నరప్‌గా నిలిచింది. గత మూడు సీజన్లలో ఢిల్లీ అంచనాలు అందుకోలేకపోయింది. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుడంటంతో పాంటింగ్‌ను ఢిల్లీ వదులుకుంది.

మరోవైపు పంబాజ్ కింగ్స్ రెండేళ్ల పాటు ప్రధాన కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్‌ను తప్పించింది. బేలిస్ కోచింగ్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగించింది. 2023 సీజన్‌లో ఎనిమిదో స్థానం, గత సీజన్‌లో తొమ్మిదో స్థానంలో పంజాబ్ నిలిచింది. అయితే భారతీయ కోచ్‌ను పంజాబ్ నియమించుకోవాలని తొలుత భావించింది. కానీ పాంటింగ్‌ను ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఇప్పటివరకు పంజాబ్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది. గత పది సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. 2014లో రన్నరప్‌గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన. మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టుడగున నిలిచింది.
మరి, రికార్డుల్లో ఇంత పేలవంగా ఉన్న పంజాబ్‌ను పాంటింగ్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి. అయితే ఇకపై నయా పంజాబ్ కింగ్స్‌ను చూస్తారని కొత్త కోచ్ పాంటింగ్ పేర్కొన్నాడు. ''ప్రధాన కోచ్‌గా అవకాశం ఇచ్చిన పంజాబ్ కింగ్స్‌కు ధన్యవాదాలు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడానికి యాజమాన్యం, మేనేజ్‌మెంట్‌తో చర్చలు గొప్పగా సాగాయి. విజన్‌ను చూసి ఎంతో సంతోషించాను. కొన్నేళ్ల పాటు మాతో ఉంటున్న అభిమానులకు తిరిగి చెల్లిస్తాం. ఇకపై కొత్త పంజాబ్ కింగ్స్‌ను చూస్తారని హామీ ఇస్తున్నా'' అని పాంటింగ్ అన్నాడు.