వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ ఆడే ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది. ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజును నిర్ణయిస్తూ బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం చారిత్రక ప్రకటన విడుదుల చేశారు. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందించనున్నట్లు తెలిపారు. ఒప్పందం చేసుకున్న మొత్తానికి ఇది అదనంగా లభిస్తుందని వెల్లడించారు.
లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే ఒప్పందం మొత్తానికి అదనంగా రూ.1.05 కోట్లు దక్కుతాయని జై షా వివరించారు. అన్‌క్యాపడ్, ఎమర్జెంగ్ ప్లేయర్లకు ఇది జాక్‌పాట్ వంటిది. ఆర్థికంగా ఆటగాళ్ల జీవితాలు మారిపోతాయి. జీతాల కోసం ఫ్రాంచైజీలకు ఓ సీజన్‌కు రూ.12.60 కోట్లు కేటాయిస్తున్నట్లు జై షా పేర్కొన్నారు.

''ఐపీఎల్‌లో ఇది ఛారిత్రక నిర్ణయంగా భావిస్తున్నాం. మన క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును ప్రవేశపెడుతున్నాం. ఓ మ్యాచ్‌కు రూ.7.5 లక్షల ఫీజును అందించనున్నాం. ఓ క్రికెటర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కాంట్రాక్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. సీజన్‌కు ప్రతి ఫ్రాంచైజీకి మ్యాచ్ ఫీజు కింద రూ.12.60 కోట్లు కేటాయిస్తున్నాం. ఇది ఐపీఎల్‌కు, మన ప్లేయర్లకు కొత్త శకం'' అని జై షా ట్వీట్ చేశారు.
అన్‌క్యాపడ్ ప్లేయర్లకు, కనీస ధర దక్కించుకున్న ఆటగాళ్లకు ఇది వరంగా మారుతుంది. ఉదాహరణకు ఓ ఆటగాడు కనీస ధర రూ.20 లక్షలతో ఓ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే రూ. 20 లక్షలతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. అయితే ఇది పూర్తిగా మన భారత ప్లేయర్లకు మాత్రమేనా? విదేశీ ఆటగాళ్లకు కూడా వర్తించనుందా అనే విషయంపై స్పష్టత లేదు. జై షా చేసిన ట్వీట్‌లో 'మన ప్లేయర్లకు' అని సంభోదించాడు. దీంతో కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే ఫీజు అందిస్తారని తెలుస్తోంది.