ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలని స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ ఆర్‌టీఎమ్‌తో నలుగురు స్టార్ ప్లేయర్లలో ఒకరినే సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది.

గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై అయిదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను అట్టిపెట్టుకుంది. ఈ ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చుపెట్టింది. దీంతో వేలంలో రూ.45 కోట్లతో బరిలోకి దిగుతోంది. నిబంధనలకు అనుగుణంగా ముంబై ఇండియన్స్ గరిష్టంగా 20 మందిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. అందులో 8 మంది విదేశీ ప్లేయర్లు ఉండాలి. తమ మాజీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది.
అయితే మెగా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించి నెహాల్ వదేరా, ఆకాశ్ మద్వాల్, నమన్ ధిర్, పీయూష్ చావ్లాలలో ఒకరిని దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. వేలంలో నెహాల్ వదేరాకు భారీ డిమాండ్ దక్కే అవకాశం ఉంది. 24 ఏళ్ల నెహాల్ ఫినిషర్‌గానే కాకుండా బంతితో కూడా రాణించగలడు. ఇక ఆకాశ్ మద్వాల్, నమన్ ధిర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
కుడిచేతి వాటం బౌలర్ ఆకాశ్ గత సీజన్‌లో నిరాశపరిచిన 2023లో సత్తాచాటాడు. నమన్ ధిర్ గత అరంగేట్రం సీజన్‌లోనే తన ధనాధన్ బ్యాటింగ్‌తో భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. వీళ్లతో పాటు అనుభవజ్ఞుడు పీయూష్ చావ్లాను ఆర్‌టీఎమ్‌తో సొంతం చేసుకునే ప్లాన్‌లోనూ ముంబై ఇండియన్స్ ఉంది. 2012లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చావ్లా తాజా నిబంధనలతో అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయ్యాడు.