టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి బంతిని ఎప్పుడు పట్టుకుంటాడనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అతడి రాక కోసం ఐపీఎల్ ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీతో పాటు ఆ జట్టు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇదిగో బుమ్రా వచ్చేస్తున్నాడు, అదిగో బుమ్రా వచ్చేస్తున్నాడు అని అంటున్నారే తప్పు.. అతడు ఎప్పుడు జట్టులోకి చేరుతాడనే విషయమై సరైన స్పష్టత రావట్లేదు. కానీ అతడు ఏప్రిల్ నెలలో ఎప్పుడైనా జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
అదేంటంటే..
ప్రస్తుతానికి బుమ్రా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ అతడి శరీరం ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్ గా తయారు అవ్వలేదు. ఇదే సమయంలో బుమ్రాను వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా అతడిని మైదానంలోకి పంపితే సమస్య పెద్దదయ్యే అవకాశమున్నట్లు వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు అతడు తన ఫైనల్ రౌండ్ ఫిట్నెస్ టెస్టులకు సిద్ధమవుతున్నాడని సమాచారం అందింది. అతడు పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి వస్తాడని వైద్యులు చెప్పారు.

అప్పుడే ఎంట్రీ..
ఏప్రిల్ 4న జరిగే లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌తో పాటు, ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ రెండు మ్యాచులకు కూడా బుమ్రా అందుబాటులో ఉండడని తెలిసింది. అతడు మైదానంలోకి అడుగుపెట్టాలంటే బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడు అతడు ఐపీఎల్ లేదా ఇతర మ్యాచుల బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడతడు ఫైనల్ రౌండ్ టెస్టులకు సిద్ధమవుతున్నాడు. ఇందులో పాస్ అయితే బుమ్రా ఏప్రిల్ 13న దిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచులకు అందుబాటులో ఉంటాడు. లేదంటే ఏప్రిల్ 17న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఇంగ్లాండ్ టూర్ కోసం ముందుగా జాగ్రత్తలు..
ఐపీఎల్ తర్వాత జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇలాంటి సమయంలో బుమ్రా ఫిట్‌నెస్‌ను సరిగ్గా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అతడు పూర్తి ఫిట్‌గా లేకపోతే, ఇంగ్లాండ్ టూర్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే అతడిని మరింత జాగ్రత్తగా చూసుకుంటోంది బీసీసీఐ. కాగా, టీమిండియా చివరిసారిగా 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ టూర్‌లో సిరీస్ విజయాన్ని చూడలేదు. 2022లో చివరి టెస్ట్ సిరీస్ 2-2తో డ్రా అయింది. అందుకే ఈ సారి ఇంగ్లాండ్ టూర్‌లో బుమ్రా అందుబాటులో ఉంటాడా? టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది? అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.