Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో వ్యూహాలు రచించడం, సరదా చర్యలతో ఉండటమే కాదు.. సహచర ఆటగాళ్లతో అప్పుడప్పుడు కోపంగా కూడా ప్రవర్తిస్తాడన్న సంగతి తెలిసిందే. అందరిముందే వారిని గట్టిగా తిడుతూ కూడా కనిపిస్తంటాడు. అలా 2024లో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడు.. టీమ్ మేట్స్‌ను ఫ్రస్టేషన్‌తో అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డై తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న హిట్ మ్యాన్.. అలా ఎందుకు అన్నాడో వివరించాడు.
ఎందుకు అన్నాడంటే?
''మీరేమైనా గార్డెన్‌లో వాకింగ్ కు వచ్చారా..'' అంటూ సహచర ఆటగాళ్లను తీవ్ర స్వరంతో మందలించాడు రోహిత్ శర్మ. దాని గురించి మాట్లాడుతూ.. ''ఆరోజు వైజాగ్‌లో మ్యాచ్. అప్పుడు ఓవర్ ముగిసిన సమయంలో మా ఆటగాళ్లు.. ఏదో గార్డెన్ లో వాకింగ్‌కు వచ్చినట్లుగా ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతున్నారు. ఒక్కరు కూడా పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా అస్సలు కనిపించలేదు. నేను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నాను. మ్యాచ్ ఎక్కడ చేజారిపోతుందేమోనని అనిపించింది. అది మాకు ఎంతో ముఖ్యమైన గేమ్. మేం గెలిచి తీరాల్సిన మ్యాచ్ అది. అందుకే ఈరోజు అందరూ ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని అందరికీ ఆ రోజు ఉదయాన్నే గట్టిగా చెప్పాను. కానీ వాళ్లు మాత్రం మైదానంలో సరదాగా తిరుగుతున్నారు. దీంతో రెండు మూడు ఓవర్లు చూశా. క్రికెట్ ఇలా ఆడకూడదు. అందుకే నాకు కోపం వచ్చింది. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను విడదీయాలని చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి శ్రమిస్తేనే ఫలితం వస్తుంది. కానీ అప్పుడు మా వాళ్లంతా ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను'' అని రోహిత్ శర్మ అప్పుడు జరిగిన సంఘటనను వివరించాడు.

ఐపీఎల్ 2025లో తుస్సు..
ప్రస్తుతం రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025లో సరైన ప్రదర్శన చేయట్లేదు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లలో 13.67 సగటుతో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రీసెంట్ గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ భారీ స్కోర్ చేయలేకపోయాడు. 16 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఉన్నది కాసేపే అయినా తనదైన స్టైల్ లో దూకుడుగా అదిరిపోయే షాట్లు ఆడాడు. అందులో 3 సిక్సర్లు కూడా ఉన్నాయి.