ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ సారైనా కప్‌ను సాధించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదునైన వ్యూహాలతో మెగా ఆక్షన్‌లో బరిలోకి దిగుతోంది.
ఆర్సీబీ రూ.37 కోట్లు వెచ్చించి విరాట్ కోహ్లి (21), రజత్ పటిదార్ (11), యశ్ దయాల్ (5)లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమ పర్స్‌లో మిగిలిన రూ.83 కోట్లతో దాదాపు 22 మందిని వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంది. అందులో 8 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది. ఆర్సీబీ దాదాపుగా జట్టును తిరిగి నిర్మించుకోవాల్సి ఉంది. అయితే మూడు స్థానాల్లో సత్తాచాటే ప్లేయర్ల కోసం మాత్రం పెద్దమొత్తాన్ని ఖర్చు చేయాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది.

డుప్లెసిస్‌ను వదిలేయడంతో ఆర్సీబీకి ప్రస్తుతం కెప్టెన్ లేడు. విరాట్ కోహ్లి సారథి బాధ్యతలు అందుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నా, అవాస్తమని ఆర్సీబీ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ కూడా ప్రకటించడంతో వికెట్ కీపర్ స్థానం కూడా ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో కెప్టెన్-వికెట్ కీపర్‌గా రెండు బాధ్యతలు నిర్వర్తించే కేఎల్ రాహుల్ లేదా రిషభ్ పంత్‌పై పెద్దమొత్తాన్ని వెచ్చించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. అయితే లోకల్ బాయ్ రాహుల్‌ను తీసుకోవడానికి ఆర్సీబీ మొగ్గుచూపుతోంది.
గత సీజన్లలో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం ఆర్సీబీ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో తమ మాజీ ప్లేయర్ యుజువేంద్ర చాహల్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. అలాగే ఫినిషర్‌ను వెతుకుతోంది. ఈ స్థానంలో డేవిడ్ మిల్లర్‌ను తీసుకోవాలని భావిస్తోంది. గత లోపాలను సరిదిద్దుకుంటూ వ్యూహాత్మంగా జట్టును నిర్మించాలనుకుంటుంది. కేఎల్ రాహుల్, చాహల్, మిల్లర్‌ను సొంతం చేసుకుని.. మిగిలిన ఆటగాళ్లను తుదిజట్టు ఆధారంగా సొంతం చేసుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తోంది.
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో కుడిచేతి వాటం బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమిలలో ఒకరిని దక్కించుకోవాలనుకుంటుంది. అలాగే కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్‌లపై కన్నేసింది. విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌టీఎమ్‌తో దక్కించుకోవాలని చూస్తోంది. ఆర్సీబీ దగ్గర మూడు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఉన్నాయి. స్పిన్ ఆల్‌రౌండర్లు లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్‌తో పాటు షాబాజ్ అహ్మద్‌ను సొంతం చేసుకోవాలనుకుంటుంది.
మెగా వేలంలో ఆర్సీబీ కన్నేసిన ఆటగాళ్ల జాబితా (అంచనా)
విదేశీ ప్లేయర్లు: గ్లెన్ మ్యాక్స్‌వెల్, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్, ట్రెంట్ బౌల్ట్, నూర్ అహ్మద్, కగిసో రబాడ
భారత ప్లేయర్లు: కేఎల్ రాహుల్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మ, కర్ణ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాద్ అహ్మద్.