క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ నిబంధనలు ఖరారు అయ్యాయి. గత మెగా వేలానికి భిన్నంగా బీసీసీఐ ఈసారి నిబంధనలను రూపొందించింది. రైటు మ్యాచ్ కార్డ్ రూల్‌ను తిరిగి తీసుకువచ్చారు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించి అయిదేళ్లు గడిచిన ఆటగాడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించనున్నారు.
గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వేలం లేదా రిటెన్షన్ ద్వారా ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు ఐపీఎల్ 2027 వరకు కొనసాగాలి. ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. అయితే రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు కచ్చితంగా అన్‌క్యాపడ్ ప్లేయర్ ఉండాలనే కండిషన్ పెట్టారు. గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉంది.

మిగిలిన అయిదుగురు ఆటగాళ్లు ఇండియన్స్ లేదా విదేశీ ప్లేయర్లు అయినా కావొచ్చు. రిటైన్ లిస్ట్‌లో విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి పరిమితి విధించలేదు. అంతేగాక ఆరుగురు ప్లేయర్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు. లేదా అందర్నీ ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా అయినా పొందవచ్చు. లేదా రెండింటి కలయికతో అయినా ఫ్రాంచైజీతోనే అట్టిపెట్టుకోవచ్చు. అయితే వేలంలో పాల్గొనే విదేశీ ప్లేయర్లపై కఠిన ఆంక్షలు విధించారు. జులైలో జరిగిన సమావేశంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ డిమాండ్ మేరకు రూల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
విదేశీ ప్లేయర్లపై రూల్స్ ఇవే:
మెగా వేలంలో పాల్గొనేందుకు విదేశీ ప్లేయర్ మొదట రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోని విదేశీ ఆటగాళ్లు తర్వాత జరిగే మినీ వేలంలో పాల్గొనడానికి అవకాశం లేదు. అలాగే మెగా వేలంలో కొనుగోలైన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందు.. అందుబాటులో ఉండట్లేదని తెలిపితే, రెండు సీజన్ల వేలంలో అతను నిషేధానికి గురవుతాడు.
శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ కారణంగానే కావ్య విదేశీ ప్లేయర్లపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. గత వేలంలో హసరంగను సన్‌రైజర్స్ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. కానీ గాయం కారణంతో హసరంగ ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. అయితే 2023 వరకు ఆర్సీబీతో హసరంగకు రూ.10 కోట్లు కాంట్రాక్ట్ ఉండేది. కానీ ఆర్సీబీ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన హసరంగ తక్కువ ధర పలికాడు. దీంతోనే అతను గాయం కారణం చెప్పి సీజన్‌కు దూరమయ్యాడని వాదన ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించింది.