రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.
ఇందులో విదేశీ ప్లేయర్లకు ఎలాంటి పరిమితి లేదు. అంటే మొత్తం అయిదుగురు ఫారెన్ ప్లేయర్లను (క్యాప్డ్ ప్లేయర్ల రూల్‌తో) కూడా అట్టిపెట్టుకోవచ్చు. నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

గడువు ముగియనుండటంతో ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు తమ కీలక ప్లేయర్లకు రిటెన్షన్ పాలసీలోని నిర్ణీత ధర కంటే అధిక మొత్తంలో ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ చేరాయి. వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను రిటైన్ లిస్ట్‌లో తమ మొదటి ప్రాధాన్యతగా ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు రూ.18 కోట్లు చెల్లించాలి.
కానీ సన్‌రైజర్స్ యాజమాన్యం క్లాసెన్‌కు ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో క్లాసెన్ నిలకడగా రాణించాడు. 2023లో 448 పరుగులు, 2024 సీజన్‌లో 479 పరుగులు సాధించాడు. 170+ స్ట్రైక్‌రేటుతో క్లాసెన్ పరుగులు బాదడం విశేషం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ తమ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌ను రిటైన్ లిస్ట్‌లో తొలి ఎంపికగా నిర్ణయించుకుంది.
అయితే పూరన్‌కు రూ.20 కోట్లు కంటే ఎక్కువ మొత్తంలో లక్నో ఫ్రాంచైజీ ఆఫర్ చేసింది. బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో సత్తాచాటే పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకోని ఎక్కువ మొత్తాన్ని లక్నో ఫ్రాంచైజీ వెచ్చించనుంది. గత వేలంలో పూరన్‌ను రూ.16 కోట్లుకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వెస్టిండీస్ బ్యాటర్ 2023 సీజన్‌లో 358 పరుగులు, 2024 సీజన్‌లో 499 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో 170+ స్ట్రైక్‌రేటుతో పరుగులు సాధించాడు.