ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన కొద్ది రోజులకే మెగా లీగ్ ఐపీఎల్ ధనాధన్ షురూ కానుంది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఒక్కోక్కటిగా అప్డేట్ లు బయటకు వస్తూ క్రికెట్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. రీసెంట్ గానే మార్చి 21 నుంచి కొత్త ఎడిషన్ ప్రారంభమవుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కూడా రెండు కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సోమవారం జనవరి 20న కొత్త కెప్టెన్ పేరును ప్రకటించడంతో పాటు కొత్త జెర్సీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది.
ఆ ఇద్దరిలో ఎవరు?
ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ (రూ.27 కోట్లు) మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అతడిని కొనుగోలు చేసింది. దీంతో పంత్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం క్రికెట్ వర్గాల్లో ఉంది. ఇదే సమయంలో పంత్‌కు పూరన్ గట్టి పోటీ నిస్తున్నాడని తెలుస్తోంది.

ఎందుకంటే ఇదే వేలానికి ముందు రిటెన్షన్‌లో రూ. 21 కోట్లకు పూరన్‌ను లఖ్‌నవూ అట్టిపెట్టుకుంది. గతేడాది కేఎల్ రాహుల్ స్థానంలోనూ కొన్ని మ్యాచ్‌లకు పూరన్ నాయకత్వం వహించాడు. దీంతో పూరన్ పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ పేర్లు కూడా ఎల్ఎస్జీ కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా.. పంత్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.