ప్రస్తుతం ఐపీఎల్ 2025 లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆ జట్టు మరో రోజులో తమ కొత్త సారథిని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. అయితే తమ నూతన కెప్టెన్ గా రిటైన్ చేసుకున్న నికోలస్ పూరన్‌ను ఎంపిక చేస్తారా, అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన పంత్ వైపు మొగ్గు చూపుతారా అని అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే LSG కొత్త కెప్టెన్ కు సంబంధించిన వివరాలు లీక్ అయిపోయాయి. అందరూ ఊహించినట్టుగానే టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కే ఆ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. ఐపీఎల్ 2025లో లఖ్‌నవూకు అతడే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే కెప్టెన్‌గా నియామకం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా నిర్ణయం తీసుకున్నారని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి.

కాగా, ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ (రూ.27 కోట్లు) మెగా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మొదటి నుంచి క్రికెట్ వర్గాల్లో ఉంది. కాకపోతే ఇదే సమయంలో పంత్‌కు పూరన్ గట్టి పోటీ నిస్తాడని కూడా అంతా అనుకున్నారు. ఇంకా ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ పేర్లు కూడా ఎల్ఎస్జీ కెప్టెన్సీ రేసులో వినిపించాయి. కానీ ఫైనల్ గా కెప్టెన్సీ విషయంలో స్వదేశీ ప్లేయర్ పంత్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది.
ఇకపోతే పంత్ 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి దిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 110 మ్యాచులు ఆడి 35.31 యావరేజ్ తో 3,284 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2021లో కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. అదే సీజన్ లో తన జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. 2022, 2024 సీజన్ లోనూ కెప్టెన్ గానే వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పంత్ ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
లఖ్‌నవూ జట్టు ఐపీఎల్ 2025 వేలానికి ముందు నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్ తో పాటు అన్ క్యాప్డ్ స్టార్స్ మోషిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకుంది. గత సీజన్ లో 14 మ్యాచుల్లో ఏడింటిలో విజయం సాధించి 14 పాయింట్లతో ఏడో స్థానంలో సరిపెట్టుకుంది.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు ఇదే :
బ్యాటర్స్ : మర్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆయుశ్ బడోని (రిటైన్), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే.
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్ (రిటైన్), ఆర్యన్ జుయల్.
ఆల్ రౌండర్లు: అబ్దుల్ సమద్ (స్పిన్), మిచెల్ మార్ష్ (పేస్), షాబాజ్ అహ్మద్ (స్పిన్), యువరాజ్ చౌదరి (స్పిన్), రాజవర్ధన్ హంగర్గేకర్ (పేస్), అర్షిన్ కులకర్ణి (పేస్).
స్పిన్నర్లు: రవి బిష్ణోయ్ (రిటైన్), ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్.
ఫాస్ట్ బౌలర్లు: మయాంక్ యాదవ్ (రిటైన్), మొహ్సిన్ ఖాన్ (రిటైన్), ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్.