లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత మూడు సీజన్లలో రెండు సార్లు ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు, 2024 సీజన్ లో మాత్రం లీగ్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టింది. అయితే ఈ సారి కొత్త కెప్టెన్ పంత్ నాయకత్వంలో బరిలోకి దిగుతోన్న ఆ జట్టు ఎలాగైనా టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు ఆ జట్టు కీలక బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్. ట్రోఫీని గెలుచుకునేందుకు తమ జట్టు ఎలా సన్నద్ధమవుతుందో, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నదో తెలిపాడు.
టైటిల్ గెలవడం కోసం ఈ సారి మీ ప్లాన్ ఏంటి?
టైటిల్ అనేది ఈజీగా సాధించే విషయం కాదని చెప్పకనే చెప్పాడు నికోలస్ పూరన్. "ముందుగా జట్టు ఎలా సన్నద్ధమవుతోంది, గెలవడం కోసం మనం ఏం చేయాలనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అన్నింటికీ పరిగణలోకి తీసుకుని ఇప్పటికే మేము ఈ సీజన్ లో జట్టుకు అవసరమైన మార్పులు చేశాం. ఈ సీజన్ తో ప్రత్యేకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను." అని చెప్పుకొచ్చాడు.

పంత్‌కు మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది?
"రిషభ్ పంత్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. క్రికెటర్ గా కూడా అతడు స్పెషల్ పర్సన్. ఈ సీజన్ లో అతడు జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 100కి 100 శాతం అతడికి సపోర్ట్ గా నిలుస్తాం. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ లో అతడిని అండగా ఉంటాం. ఈ సీజన్ ఎంతో ఎక్సైటింగ్ గా ఉంటుందని మేం భావిస్తున్నాం."
మీరు పంత్ కు ఏమైనా సలహా ఇస్తారా?
"నేను ఓపెన్ బుక్ లాంటోడిని. నాకు క్రికెట్ పై మంచి పట్టు ఉందని పంత్ కు తెలుసు. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితులోనైనా నేను అతడి దగ్గరికి వెళ్లి మాట్లాడగలను. పంత్ కూడా అంతే. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. మా ఇద్దిరి మధ్య ఎలాంటి ఇబ్బందులు, మనస్పర్థలు కానీ లేవు. నా సపోర్ట్ అతడికి 100 శాతం ఉంటుంది. నేను జట్టుకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాను. జట్టుకు ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను."
అవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మీ జట్టుపై ఏమైనా ప్రభావం పడుతుందా?
"కచ్చితంగా. మా జట్టుకు ఇది పెద్ద దెబ్బ. మేం ఈ ముగ్గురితో ప్రణాళికలు రచించాం. కానీ దురదృష్టవశాత్తు ఈ కీలక బౌలర్లంతా ఇప్పుడు గాయపడ్డారు. ఈ సీజన్ లో ఏ దశలోనైనా వారు తిరిగి కోలుకుని వచ్చి జట్టుకు తమ సేవలను అందిస్తారని భావిస్తున్నాం.ఇక కోచింగ్ స్టాఫ్ లో జహీర్ ఖాన్ మాతో ఉన్నాడు. అతడు లెజెండ్. ఎంతో మందికి రోల్ మోడల్. అతడి నుంచి బౌలర్లు చాలా నేర్చుకున్నారు. ఈ టోర్నీ రెండు నెలల పాటు సాగుతుంది. అతడు యంగ్ బౌలర్సతో కలిసి పనిచేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది."