Zaheer Khan becomes Father: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ 46 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సంతోషం వ్యక్తం చేస్తూ.. తమకు అబ్బాయి జన్మించాడని చెప్పారు. బాబుతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లైన 8 ఏళ్లకు..
తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు జహీర్ ఖాన్, సాగరిక ఘట్గే దంపతులు. ఈ ఫొటోల్లో వీరిద్దరు ఎంతో సంతోషంగా కనిపించారు. జహీర్ ఖాన్, సాగరిక ఘట్గేది ప్రేమ పెళ్లి. కొద్ది రోజుల పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. 2017 నవంబర్ 23న వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ ముంబయిలో జీవిస్తున్నారు. అలా పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరు తొలి బిడ్డకు జన్మనిచ్చారు.

ఐపీఎల్ లో బిజీ..
జహీర్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో ఈ జట్టు పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.086గా ఉంది. తద్వారా పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.
నేషనల్ కెరీర్..
జహీర్ ఖాన్ తన క్రికెట్ కెరీర్ లో 2000 నుంచి 2014 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 92 టెస్టు మ్యాచులు ఆడి 1231 పరుగులు చేయడంతో పాటు 311 వికెట్లు తీశాడు. 200 వన్డే మ్యాచులు ఆడి 792 పరుగులతో పాటు 282 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదరశ 11 సార్లు చేశాడు. టెస్టుల్లో ఓ మ్యాచులో అయితే ఏకంగా 10 వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 7/87.