Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టుకు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్ర మ్యాచులోనే తొలి బంతికి సిక్స్ బాదిన అతడు.. ఆ మ్యాచులో సెన్సేషనల్ బ్యాటింగ్ కొనసాగించి తన సత్తా ఏంటో నిరూపించాడు. మొత్తంగా 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 34 పరుగులు చేసి అద్భుతం చేశాడు.
అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్.. ఎప్పటిలాగే తమ ప్లేయర్స్ కలిసి సరదాగా సందడి చేసే ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్ల మధ్య ఓ ఆసక్తికరమైన చర్చ సాగింది. ముఖ్యంగా వైభవ్ మ్యాచులో ఉపయోగించిన బ్యాట్ విషయమై ఓ పెద్ద చర్చే సాగింది. ఈ క్రమంలోనే వైభవ్.. అందరినీ పిచ్చోళ్లను చేస్తున్నాడని మరో ఆటగాడు అనడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?, పూర్తిగా వీడియోలో ఏముందంటే?

మనందరిని పిచ్చోళ్లను చేశాడు..
మ్యాచ్ తర్వాత స్టేడియంలో రాజస్థాన్ ఆటగాళ్లందరూ కలిసి ఉండగా.. లక్నో బ్యాటర్ అర్షిన్ కులకర్ణి వచ్చి 'ఈ 14 ఏళ్ల ఈ కుర్రాడు నన్ను, మనందరిని పిచ్చోళ్లను చేస్తున్నాడు' అంటూ అనడం మొదలుపెట్టాడు. 'బ్రదర్ వైభవ్, నీ బ్యాట్ నాకు ఇవ్వు' అంటూ కులకర్ణి - వైభవ్ బ్యాట్ లాక్కున్నాడు. దానికి "నీకు ఎక్ట్స్ ట్రా సైట్ బ్యాట్ కావాలి, ఈ బ్యాట్ నీకు సరిపోదు, నా బ్యాట్ నాకు ఇచ్చేయ్. నాకు ప్రాక్టీస్ కు అవసరం, మరో బ్యాట్ కూడా నా దగ్గర లేదు. సంజూ అన్న బ్యాట్ తోనే మ్యాచ్ ఆడాను." అని వైభవ్ తిరిగి సమాధానం ఇచ్చాడు.
దానికి కులకర్ణి.. 'నన్ను పిచ్చోడిని చేస్తున్నావా, చూడండి వీడు నన్ను పిచ్చోడిని చేస్తున్నాడు' అంటూ కులకర్ణి అన్నాడు. అప్పుడు వైభవ్ మళ్లీ.. "నేను నిన్ను పిచ్చోడిని చేయట్లేదు. ఇది నా మంచి బ్యాట్. పాత మ్యాచ్ బ్యాట్. దీనికి రీపెయిర్ కూడా ఉంది." అంటూ తిరిగి సమాధానం ఇచ్చాడు. అయితే ఇదంతా సరదా సంభాషణగా సాగింది. చివరికి కులకర్ణి, వైభవ్ కలిసి నడుచుకుంటూ, నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు దాన్ని చూసేయండి...
కాగా, లక్నో జరిగిన మ్యాచులో 34 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. యశస్వి జైశ్వాల్ తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే 8.4 ఓవర్ వద్ద.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు వైభవ్.