రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం లోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.
నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు అన్ని దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా దశాబ్దం తర్వాత టైటిల్ అందించిన తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడానికి సిద్ధమైంది. శ్రేయస్‌ను నేరుగా రిటైన్ చేసుకోవట్లేదని, వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. అయితే ఆర్‌టీఎమ్‌తో కూడా శ్రేయస్‌ను తీసుకోవాలని కేకేఆర్ ప్రస్తుతం భావించట్లేదని తెలుస్తోంది. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను శ్రేయస్ ఛాంపియన్‌గా నిలబెట్టిన విషయం తెలిసిందే.
శ్రేయస్‌కు వదులుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. కేకేఆర్ ఫ్రాంచైజీని శ్రేయస్ భారీ మొత్తం కోరినట్లు సమాచారం. దీనిపై మేనేజ్మెంట్ సంతృప్తిగా లేదు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ జీతం రూ.12.25 కోట్లు. ఆర్థిక కారణాలతో పాటు శ్రేయస్ అయ్యర్ ఫిటెనెస్, ఫామ్, టీమిండియాలో అతని చోటు.. ఇలా అన్ని కారణాలతో కెప్టెన్‌పై వేటు వేయడానికి కేకేఆర్ సిద్ధమైందని తెలుస్తోంది.
గాయం కారణంగా 2023 సీజన్‌కు దూరమైన శ్రేయస్ ఈ సీజన్‌లో 39 సగటుతో 351 పరుగులు చేశాడు. ఇక టీమిండియా టీ20, టెస్టు జట్టులో శ్రేయస్ ఇప్పటికే చోటు కోల్పోయాడు. అంతేగాక అతనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా అందించలేదు. ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకుని అతన్ని వద్దనుకుందని సమాచారం.