Kavya Maran: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే సగటు క్రికెట్ అభిమానికి టక్కున మదిలో మెదిలేది 300 స్కోరు. అంచనాలకు తగ్గట్టే వారు కూడా ఈ సీజన్ తొలి మ్యాచులో రాజస్థాన్ పై 286/6తో చెలరేగి ఆడారు. అబ్బో దీంతో సన్‌రైజర్స్ అభిమానులు పొంగిపోయారు. కానీ తొలి మ్యాచ్ తర్వాత కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచులో 150 స్కోరు చేయడానికి కూడా కష్టపడుతూ దారుణంగా విఫలమైంది. అసలు ఇంకా చెప్పాలంటే.. మ్యాచ్ 16, 17 ఓవర్లకే చాప చుట్టేసింది.
రూ.86.25 కోట్లు వేస్ట్..
దీంతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య పరిస్థితి దారుణంగా మారిపోయింది. జట్టు గెలిస్తే ఉప్పొంగిపోతూ, ఓడితే తీవ్రంగా నిరాశ చెందుతూ .. తన హావాభావాలతో, అందంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఆమె ముఖ్యం.. ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో వెలవెలబోతోంది. ఆటగాళ్లపై ఆమె పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోతోంది. మరీ ముఖ్యంగా ఆరుగురు ఆటగాళ్లపై ఆమె పెట్టిన భారీ పెట్టుబడి రూ.86.25 కోట్లు అంతా వేస్ట్ అయిపోయింది.

ఐదుగురు కోసమే రూ.75 కోట్లు..
ఐపీఎల్ 2025 ముందు సన్‌రైజర్స్.. మొదటగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆ ఐదుగురి కోసం కావ్య పాప.. ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం రూ.18 కోట్లు వెచ్చించింది. దూకుడు బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ.23 కోట్లు వెచ్చించింది. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కోసం చెరో రూ.14 కోట్లు ఖర్చు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కోసం రూ.6 కోట్లు ఇచ్చింది. అలా మొత్తంగా ఈ ఐదుగురి కోసమే పర్సులో నుంచి రూ.75 కోట్లు వెచ్చించింది. ఇక ఇషాన్ కిషన్ కోసం మెగా వేలంలో రూ.11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
కేవలం 2 మ్యాచుల్లోనే...
దీంతో..'ఈ ఆరుగురు ఆటగాళ్లే సన్ రైజర్స్ బ్యాటింగ్ కు ప్రధాన బలం. ప్రతి మ్యాచ్ లోనూ 200 నుంచి 300 స్కోరు చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్లు. అలానే కమిన్స్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడు.' అని ఈ సీజన్ ప్రారంభానికి ముందు అంతా అనుకున్నారు. కానీ వీళ్లంతా కలిసి కావ్య పాపతో పాటు అభిమానుల అంచనాలను బోల్తా కొట్టించారు. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడితే కేవలం రెండు మ్యాచుల్లోనే 200 స్కోరు చేశారు. అందులో ఒకటి తొలి మ్యాచులో 286 పరుగులు. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్, ఛేజింగ్ లో ప్రత్యర్థులు 17 ఓవర్లలోనే గెలిచేలా ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచులో ఛేదన చేసిన ఈ జట్టు.. 17 ఓవర్ కల్లా అన్ని వికెట్లను కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
కావ్య పాప నిర్ణయం కరెక్టేనా...
దీంతో క్రికెట్ అభిమానులు.. ఆరుగురు ఆటగాళ్ల కోసం కావ్య మారన్ ఖర్చు చేసిన రూ.86.25 కోట్లు మొత్తం వృథా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అలానే ఆ ఆటగాళ్ల కోసం కావ్య మారన్ అంత మొత్తం పెట్టడం కరెక్టా కాదా అంటూ చర్చలు జరుపుతున్నారు. అభిషేక్ శర్మ ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులే చేశాడు. ఇతడి కన్నా బౌలర్ కమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్సే ఐదు మ్యాచుల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఎక్కువ పరుగులు (56) చేశాడు. అంటే అభిషేక్ శర్మ రూ.14 కోట్లు వేస్ట్. క్లాసెన్ ఐదు మ్యాచుల్లో 152 పరుగులు చేయగా.. అందులో అతడి అత్యధిక స్కోరు 34. అంటే ఒక్క మ్యాచుకు యావరేజ్ గా 30 పరుగులు చేశాడన్నమాట. జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ను ఆడలేదు. ఇక ఇషాన్ కిషన్ తొలి మ్యాచులో 106 సెంచరీ చేయడంతో విజయం సాధించింది. లేదంటే ఆ విజయం కూడా దక్కేది కాదు. అయినా ఇషాన్ కిషన్ ఆ తర్వాతి మ్యాచులో విఫలమైపోయాడు. నాలుగు మ్యాచుల్లో కలిపి 21 పరుగులే చేశాడు.