పక్షిలా గాల్లోకి ఎగురుతూ క్యాచ్‌లు పట్టడం.. పాదరసంలా కదులుతూ ఫీల్డింగ్ విన్యాసాలు చేయడం అంటే ప్రస్తుత క్రికెట్ లో గుర్తొచ్చే పేరు గ్లెన్ ఫిలిప్స్. అతడు డైవ్‌లు చేస్తూ క్యాచ్‌లు పట్టేస్తుంటే ప్రేక్షకులను మతి పోతుంటుంది. అయితే తాజాగా అతడు తాను క్రికెటర్ కాకపోయి ఉంటే ఏం అయ్యేవాడో వివరించాడు. ఇంకా క్రికెట్ లో రిటైర్మెంట్ అయ్యాక తానేం చేయాలనుకుంటున్నాడో తెలిపాడు.
గాల్లో ఎగరడం ఇష్టం..
మైదానంలో ఫీల్డింగ్ చేసేటప్పుడు గాల్లోకి ఎగిరి ఎలా అయితే క్యాచులు పట్టడం ఎలా అయితే ఇష్టమో.. నిజజీవితంలోనూ గాల్లోకి ఎగరడమంటే బాగా ఇష్టమని చెప్పాడు ఫిలిప్స్. "గాల్లో ఎగరడం, ప్రయాణించడమంటే చాలా ఇష్టం. ఒకవేళ నేను క్రికెట్ ఆడకపోయి ఉంటే, అలానే ప్రపంచంలోని డబ్బంతా నా దగ్గర ఉంటే, నా జీవితంలో నేను పైలెట్ అయ్యేవాడిని. నా జీవితాన్ని కూడా పైలెట్ తోనే ముగించేవాడిని. నాకు గాల్లో ఉండటమంటే చాలా ఇష్టం." అని అన్నాడు.

నాకు కూడా తెలీదు..
"పైలట్ గా ఉండటానికి సంబంధించిన విధానాలు, రేడియో కమ్యూనికేషన్స్ సహా అతడి చుట్టు ఉండే వాతావరణం అన్నీ బాగా ఇష్టపడతాను. ముఖ్యంగా విమానాన్ని హ్యాండిల్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. నిజంగా నాకు తెలీదు మరి అది అంటే అంత ఎందుకు ఇష్టమో. నేనే కాదు విమానాన్ని ప్రేమించే వారు ఎవరైనా సరైన కారణం చెప్పలేరు. అయినా విమానంలో ప్రయాణించడం, ఎగరడం అనేది మనుషులు ఎప్పటి నుంచో కోరుకున్న అనుభూతే. కాబట్టి, నేను కూడా దానిని అతీతుడిని ఏమీ కాదని భావిస్తున్నాను. " అని వెల్లడించాడు.
పర్వత ప్రాంతాల్లో...
తాను క్రికెట్ లో రిటైర్మెంట్ అయ్యే సమయానికి కావాల్సినంత డబ్బు సంపాదించలేకపోతే, పైలెట్ గా మారుతానని చెప్పాడు ఫిలిప్స్. "క్రికెట్ తర్వాత నేను ఏదైనా నచ్చిన పని చేస్తూ ఆనందంగా గడపాలనే కోరిక ఉంది. అందులో పైలెట్ కూడా ఒకటి. అసలు క్రికెట్ తర్వాత కూడా ఏదైనా పని చేయాల్సి వస్తే అది పైలెట్ గా మాత్రమే చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. లేదంటే ఏ పనిపై పై ఆధారపడకుండా పర్వత ప్రాంతాల్లో సమయం గడపగలిగితే అది నాకు అందమైన జీవనం అవుతుంది." అని పేర్కొన్నాడు. ఇకపోతే గాల్లోకి ఎగిరి క్యాచులు పట్టడం తనకు సహజంగా వచ్చిన ప్రతిభ అని చెప్పాడు ఫిలిప్స్. అలానే తాను సాధన చేస్తూ శ్రమిస్తానని కూడా చెప్పాడు.