IPL 2025: ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడేందుకు ముంబై జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. తాజాగా ముంబై జట్టులో బుమ్రా చేరాడు. ఈ సందర్భంగా ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తమ కొడుకు అంగద్ కు బుమ్రా ఐపీఎల్ జర్నీ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు. బుమ్రా జట్టులో చేరినప్పటికీ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో ఈ స్టార్ బౌలర్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల 13న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో కచ్చితంగా ఆడతాడని సమాచారం.

జనవరిలో సిడ్నీలో జరిగిన భారత్ వర్సెస్ ఆస్డ్రేలియా ఐదో టెస్ట్ సందర్భంగా గాయం కారణంగా బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. బుమ్రాకు వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు నుంచి తొలగించబడ్డాడు. ట్రెంట్ బౌల్ట్ ఉన్నప్పటికీ, యువ పేసర్ అశ్వనీ కుమార్ వచ్చినప్పటికీ బౌలింగ్ బలహీనంగా కనిపించినందున బుమ్రా ముంబై జట్టులోకి తిరిగి రావడం పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ముంబై జట్టు ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. బుమ్రా తిరిగి రావడంతో పుంజుకుంటుందో వేచి చూడాల్సిందే.