IPL 2025: వారం రోజుల విరామం తర్వాత మే 17న ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ లీగ్ నిలిపివేతతో విదేశీ ఆటగాళ్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు చాలా మంది ఆటగాళ్లు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ఐపీఎల్ రెండో దశలో ఆడటానికి కొంత మంది ఆటగాళ్లు సిద్ధంగా లేరు. ఈ నివేదికలో ఐపీఎల్ రెండో దశలో ఆడుతున్న ప్రతి జట్టులోని విదేశీ ఆటగాళ్ల జాబితాను తెలుసుకుందాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడనున్నారు. ఈ క్రమంలో కొందరు ఐపీఎల్ 2025 కోసం ఇండియాకు తిరిగి రాకపోవచ్చు.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ జట్టుకు గుడ్ న్యూస్ లభించింది. జోస్ బట్లర్, జెరాల్డ్ కోయెట్జీ బుధవారం తిరిగి జట్టులో చేరారు. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత వారిద్దరూ భారత్ విడిచి వెళ్లిపోయారు. అయితే లీగ్ దశ తర్వాత బట్లర్ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు సమాచారం. మే 29న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో బట్లర్‌ను చేర్చారు. షెర్పేన్ రూథర్‌ఫోర్డ్ కూడా వెస్టిండీస్ జట్టులో ఉన్నాడు. రూథర్‌ఫోర్డ్ కగిసో రబాడ, రషీద్ ఖాన్, కరీం జనత్‌లతో కలిసి ఇండియాలోనే ఉన్నాడు. మే 21-25 వరకు ఐర్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రూథర్‌ఫోర్డ్ ఆడటం లేదు. ఇంగ్లాండ్ సిరీస్ వెస్టిండీస్‌కు చాలా ముఖ్యమైంది. వారు 2027 ప్రపంచ కప్‌కు అర్హత కోసం పోరాడుతున్నారు. వారు ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 8వ, 9వ స్థానాల్లో ఉన్నారు. రబాడ లీగ్ దశ వరకు ఆడతాడు. కానీ ఆ తర్వాత అతను ఆడతాడా లేదా అనేది స్పష్టంగా లేదు. కగిసో రబాడ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టు మే 31న ఇంగ్లాండ్‌లో సమావేశం కానుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆర్సీబీకి అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ ఇప్పటికే గాయపడ్డారు. ఇప్పుడు ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండడు. భుజం గాయం కారణంగా హేజిల్‌వుడ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్ ఆడలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా దగ్గర పడింది. అందువల్ల హేజిల్‌వుడ్ మిగిలిన మ్యాచ్‌లలో ఆడే అవకాశాలు చాలా తక్కువ. ఇంగ్లాండ్ వన్డే జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్ జాకబ్ బెథెల్ కూడా చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌కు చెందిన రొమారియో షెపర్డ్ కూడా ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో లుంగి ఎంగిడిని చేర్చుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఎక్కువగా నష్టపోవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. కానీ వారి కీలక బౌలర్ మిచెల్ స్టార్క్ లభ్యత గురించి కూడా వారు ఆందోళన చెందుతున్నారు. స్టార్క్ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియా నుంచి వస్తున్న నివేదికల ప్రకారం ఇండియాకు అతను తిరిగి రాలేడని సమాచారం. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ కూడా తిరిగి రాలేడని తెలిసింది. అయితే ఢిల్లీ ఫ్రాంచైజీ అతనితో టచ్‌లో ఉంది. మిగిలిన విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరే అవకాశం ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అందువల్ల లీగ్ దశ తర్వాత స్టబ్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.
ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ జట్టులోని విదేశీ ఆటగాళ్లందరూ తిరిగి జట్టులో చేరనున్నారు. కానీ లీగ్ దశ తర్వాత తన ఇద్దరు ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి బలమైన పోటీదారులుగా ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్లు విల్ జాక్స్, కార్బిన్ బాష్ అందుబాటులో ఉండకపోవచ్చు. వారి ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్
ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ తిరిగి జట్టులో చేరుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. బుధవారం నాటికి పరిస్థితిపై స్పష్టత వస్తుందని ఫ్రాంచైజీ ఆశిస్తోంది. మిగిలిన విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరడానికి సిద్దంగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలనే ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇంగ్లిస్, స్టోయినిస్ జట్టులో చేరకపోతే అది జట్టుకు భారీ నష్టం కావచ్చు. మార్కో జాన్సెన్ ప్లేఆఫ్స్‌లో పాల్గొనడం కూడా కష్టమే.
కోల్‌కతా నైట్ రైడర్స్
ముగ్గురు వెస్టిండీస్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్ దుబాయ్ క్యాంపింగ్ చేస్తున్నారు. వారు క్వింటన్ డికాక్, అన్రిచ్ నార్ట్జే, రహ్మానుల్లా గుర్బాజ్‌లతో కలిసి జట్టులో చేరబోతున్నాడు. అయితే మంగళవారం నాటికి మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్ చేరతారా లేదా అనే స్పష్టం తెలియరాలేదు.
చెన్నై సూపర్ కింగ్స్
నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్, మతిషా పతిరానా, డెవాన్ కాన్వే ప్లేయర్లందరూ జట్టులో చేరే అవకాశం ఉంది. రచిన్ రవీంద్రపై ఇంకా స్పష్టత లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. సీఎస్కేకు ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందువల్ల ఇతర ఆటగాళ్ల విషయంలో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిర్ణయం తీసుకోవాలి. జామీ ఓవర్టన్ ఇంగ్లాండ్ వన్డే జట్టులో సభ్యుడు. అందువల్ల అతను తిరిగి రాలేడు. కానీ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ జట్టులో చేరే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ జట్టులో చేరడానికి అంగీకరించారు. హెన్రిచ్ క్లాసెన్ కూడా జట్టులో చేరనున్నాడు. శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్, ఇషాన్ మలింగ కూడా జట్టులో చేరనున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల గురించి ఎటువంటి సమాచారం లేదు.