రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి గడువు ముగుస్తున్న వేళ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సారి మెగా వేలంలో ఏకంగా అయిదుగురు కెప్టెన్లు బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు దశాబ్దం తర్వాత టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ కూడా ఉండటం గమనార్హం. యాజమాన్యంతో ఒప్పందాలు కుదరక కొందరు కెప్టెన్లు వేలంలోకి వస్తుండగా, మరికొందరు ఫ్రాంచైజీల వ్యూహాలతో మెగా ఆక్షన్‌కు వస్తున్నారు.
అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాలన్న విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు.

రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. రిటెన్షన్ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అయితే ఈ నిబంధనలు కేకేఆర్‌కు తలనొప్పిగా మారాయి. తమ జట్టులో ఏ ఆటగాడిని విడిచిపెట్టాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, ఫిలిప్ సాల్ట్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లలో అయిదుగురిని ఎంపిక చేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కొనసాగించాలని ఇష్టం ఉన్నప్పటికీ వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాలతో ఒప్పందాలు కుదరక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వేలంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
శిఖర్ ధావన్ దూరమవ్వడంతో గత సీజన్‌కు సారథి బాధ్యతలు నిర్వర్తించిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టనుంది. అయితే సామ్ కరన్‌ను ఆర్‌టీఎమ్‌తో తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. అలాగే ఫాప్ డుప్లెసిస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలోనే తీసుకోవాలని చూస్తోంది.ఈ క్రమంలో ఏకంగా అయిదుగురు కెప్టెన్లు మెగా ఆక్షన్ బరిలోకి దిగుతున్నారు.