RCB vs PBKS, IPL 2025 Final: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగింది. టాస్ వేసిన వెంటనే వర్షం పడటంతో ఈ మ్యాచ్ ప్రారంభం దాదాపు రెండు గంటలు ఆలస్యమైంది. దాదాపు రెండు గంటల పాటు ఈ దాగుడుమూతల వర్షం కొనసాగింది. రాత్రి 9.45 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత వర్షం మళ్లీ ఆటంకం కలిగించలేదు. చివరికి పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ జూన్ 3న నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు మొదటి సీజన్ నుంచి లీగ్‌లో భాగంగా ఉన్నాయి. రెండూ తమ మొదటి టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులు ఈ సీజన్ లో కొత్త ఛాంపియన్‌ను పొందడం ఖాయం. అయితే మంగళవారం అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉన్నందున మ్యాచ్‌కు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది.

ఫైనల్ రోజు వర్షం పడే అవకాశం
మంగళవారం మధ్యాహ్నం నగరంలో కొంత వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉండనుండగా.. సాయంత్రం నాటికి 27 డిగ్రీలకు తగ్గనుందని అంచనా. ఆక్యూవెదర్ ప్రకారం పగటిపూట ఒక గంట వర్షం పడవచ్చు. వాతావరణం శాఖ ప్రకారం సాయంత్రం కూడా వర్షం పడే అవకాశం ఉంది.
మ్యాచ్ రద్దయితే..?
వర్షం పడితే మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. కానీ జూన్ 3న వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే జూన్ 4ను రిజర్వ్ డేగా ఉంచారు. మ్యాచ్ ఫలితం ఆ రోజున రావచ్చు. అంపైర్లు మొదటి రోజే మ్యాచ్ ఫలితాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది సాధ్యం కాకపోతే మ్యాచ్ రిజర్వ్-డేకు వెళ్తుంది. కానీ రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం నిర్ణయించబడకపోతే పంజాబ్ కింగ్స్ ట్రోఫీని అందుకుంటుంది. ఎందుకంటే వారు పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ముందంజలో ఉన్నారు.