Kohli Rohit: ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదిరే ప్రదర్శన చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోహ్లీ ఫామ్ విషయానికొస్తే.. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఛాంపియన్‌గా నిలపాలనే ఏకైక లక్ష్యంతో అతడు ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపు కసి అతడిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్ గా బరిలోకి దిగుతోన్న అతడు.. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో కోహ్లీ 65.33 సగటుతో 392 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు ఉండటం విశేషం.
రెండు హాఫ్ సెంచరీలు బాది..
రోహిత్ శర్మ అయితే ఏకంగా తొలి బంతి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడుతుంటాడు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలో అతడు అంతగా ఫామ్ చూపించలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగుతున్న అతడు.. ఒక మ్యాచ్‌లో అయితే బెంచ్‌కే పరిమితం అయ్యాడు. తొలి ఆరు మ్యాచుల్లో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు (76, 70) బాదాడు. తనకిష్టమైన లెగ్‌సైడ్ సిక్స్‌లను అలవోకగా బాదేస్తున్నాడు. ముంబై కూడా ప్లేఆఫ్స్ రేసులో ముందుకొచ్చేసింది. ఇకపై కూడా రోహిత్ తో పాటు ముంబై జట్టులోని అతర ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తే.. టోర్నీలో ముందుకెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.
కాస్త తొందరపడ్డారేమో..
అయితే వాస్తవానికి గతేడాది టీ20 క్రికెట్ లో రోహిత్, కోహ్లీ ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది టీ20 ప్రపంచ కప్‌లోనే మళ్లీ ఫామ్ లోకి వచ్చి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు రోహిత్. అలానే అదే టోర్నీ ఫైనల్ లో కీలక ఇన్నింగ్స్ (76 పరుగులు) ఆడి జట్టుకు విజయాన్నందించాడు విరాట్. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు పొట్టి క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2025లో వీరిద్దరి ఫామ్ చూస్తుంటే.. కాస్త తొందరపడ్డారేమోనని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు అనుకుంటున్నారు. వారిద్దరూ వచ్చే ఏడాది పొట్టి కప్ బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు.
