క్రికెట్ ప్రపంచంలో ప్రతిభను గుర్తించి, యువ క్రికెటర్లను తీర్చిదిద్దే వారిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ధోనీ నాయకత్వంలో ఎదిగిన వారే. కోహ్లీ కెరీర్ తొలినాళ్లలో అతడికి ధోనీ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచాడు. అలానే రోహిత్ ప్రతిభను మరింతగా వినియోగించుకోవాలంటే ఓపెనర్‌గా పంపాలని ధోనీ చేసిన సూచనే, హిట్ మ్యాన్ కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇంకా ఎంతో మంది క్రికెటర్లు కూడా ధోనీ నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఎదిగిన వారే. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో క్రికెటర్ కూడా వచ్చి చేరాడు. మహీ గైడెన్స్ వల్లే తాను గొప్ప క్రికెటర్ గా ఎదుగుతున్నానని బలంగా చెప్పాడు. అతడు మరెవరో కాదు మతీశా పతిరణ.
సంగీత కుటుంబం నుంచి క్రికెట్ లోకి..
పతిరణ.. సంగీత కుటుంబానికి చెందిన వాడు. మతీశా పతిరన సర్టిఫైడ్ పియానిస్ట్.. సింగర్. బేస్‌బాల్‌తో క్రీడల కెరీర్‌ను ప్రారంభించాడు. అతడికి మొదట్లో క్రికెట్‌తో పెద్దగా పరిచయం లేదు. అనుకోకుండా ఇతరుల సూచనతో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కానీ అతడి టాలెంట్‌ను సీఎస్కే నెట్స్ లో మహేంద్ర సింగ్ ధోనీనే మొదటగా గుర్తించి ప్రోత్సాహించాడు! తొలి పరిచయంలోనే ఈ యువ పేసర్‌లో ఏదో ప్రత్యేకత ఉందని ధోనీ గమనించాడు.

ధోనీ వల్లే ఐపీఎల్ అరంగేట్రం
పతిరణ ప్రతిభ చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ, అతడిని ఐపీఎల్ 2022 సీజన్‌లో అన్ క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్ గా రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గాయపడిన అడమ్ మిల్నే స్థానంలో అతడికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ధోనీ మార్గదర్శకత్వంలో పతిరణ ఎదుగుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు శ్రీలంక తరఫున అతడు 31 మ్యాచ్‌లు కూడా ఆడాడు.
ధోనీ నా తండ్రి..!
తాజాగా సీఎస్కే షేర్ చేసిన ఓ వీడియోలో పతిరణ తల్లిదండ్రులు ధోనీ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. తమ కొడుకు కెరీర్ పై ధోనీ ఎంతటి ప్రభావం చూపాడో వివరించారు "ఎంఎస్ ధోనీ గురించి మాటల్లో చెప్పలేం. అతడు నిజమైన దేవుడు. పతిరణ తన తండ్రిని ఎంతగా గౌరవిస్తాడో.. అలాగే ధోనీని కూడా గౌరవిస్తాడు." అని పతిరణ తల్లి చెప్పుకొచ్చారు. "శ్రీలంకలో నువ్వే నా తండ్రి, కానీ ఇండియాలో ధోనీనే నా తండ్రి అని నా కొడుకు అంటుంటాడు" అని పతిరణ తండ్రి చెప్పారు. "ధోనీ నా తండ్రిలా భావిస్తాను. క్రికెట్‌లో నన్ను అంతకుమించిన స్థాయికి తీసుకెళ్లింది ధోనీనే. నన్నుఆయన ప్రోత్సహించిన తీరు.. ఇంట్లో నా తండ్రి ఇచ్చిన మద్దతుతో సమానం" అని పతిరణ చెప్పుకొచ్చాడు.
అదే అతడి ప్రత్యేకత..
ఐపీఎల్ 2023లో పతిరణ మంచిగా రాణించాడు. ఆ సీజన్ లో చెన్నై విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. 2024లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. దీంతో రూ.13 కోట్లకు రిటైన్ చేసుకుని సీఎస్కే. సీఎస్కే తరఫున ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడి 39 వికెట్లు తీయగా, అతడి ఎకానమీ రేట్ 7.88గా ఉంది. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 4/28. డెత్ బౌలర్‌గా పరుగులను నియంత్రించడం.. వికెట్లు తీయడం ఇతడి ప్రత్యేకత.