Ajinkya Rahane Injury update: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన తాజా కీలక మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ పై గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే విజయోత్సాహంలో ఉన్న కేకేఆర్ కు భారీ ఎదురుదెబ్బ తగలింది! ఆ జట్టు కెప్టెన్ రహానెకు గాయమైంది.
నొప్పితో విలవిలలాడుతూ..
దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులోనే రహానెకు దెబ్బ తగిలింది. బంతిని ఆపే ప్రయత్నంలో అతడి చేతికి దెబ్బ తాకింది. 12వ ఓవర్ మొదటి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ కు యాండ్రూ రసెల్ హాఫ్ వోలీ ఔట్ సైడ్ మీదుగా బంతిని సంధించాడు. దాన్ని ఫాఫ్ డుప్లెసిస్ ముందుకొచ్చి ఎక్స్ ట్రా కవర్ మీదుగా బాదాడు. ఆ బంతినే రహానె ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ బాల్ అతడి చేతి వేలికి బలంగా తాకి రక్తం వచ్చింది. బంతి తగలగానే అతడు నొప్పితో విలవిలలాడాడు.
దీంతో వెంటనే మైదానంలోకి ఫిజియోలు వచ్చి రహానెను బయటకు తీసుకెళ్లారు. ఆ వెంటనే నరైన్ బాధ్యత తీసుకుని మ్యాచును ముందుకు తీసుకెళ్లాడు. తన(27, 3/29) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడంతో మ్యాచును మలుపు తిప్పి జట్టుకు విజయాన్నందించాడు. దిల్లీ క్యాపిటల్స్ పై ఒత్తిడి తీసుకొచ్చి కేకేఆర్ ను గెలిపించాడు.
గాయంపై రహానె ఏం అన్నాడంటే
కాగా, ఈ మ్యాచులో నెం.3లో దిగిన రహానె దూకుడు ప్రదర్శన చేశాడు. 14 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఓ సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత రఘువంశీ (44; 32 బంతుల్లో 3×4, 2×6), రింకు సింగ్ (36; 25 బంతుల్లో 3×4, 1×6) అద్భుతంగా రాణించారు. అయితే దిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ ను 204 స్కోరుకు కట్టడి చేశాడు. అయితే మ్యాచ్ అయ్యాక తన చేతికి తగలిన గాయంపై రహానె మాట్లాడాడు. తాను బానే ఉన్నట్లు స్పష్టత ఇచ్చాడు. కానీ మెడికల్ స్టాఫ్ మాత్రం.. పూర్తిగా చెక్ చేశాకే రహానె తర్వాతి మ్యాచులో ఆడాలా వద్దా క్లారిటీ ఇస్తామని తెలిపింది.
