CSK VS RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ సీఎస్కే అనగానే ప్రతీ క్రికెట్ అభిమానికి టక్కున గుర్తొచ్చే పేరు ధోనీ. ధోనీ అంటే సీఎస్కే, సీఎస్కే అంటే ధోనీ అనేంతలా ప్రతీ క్రికెట్ అభిమానుల మదిలో ఉండిపోయింది. అయితే ఇప్పటికీ కూడా సారథిగా ధోనీ లేకపోయినప్పటికీ, తెర వెనక నుంచి మహీనే నడిపిస్తాడని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదని తాజాగా స్వయంగా మహీనే స్పష్టం చేశాడు. తాను ఐపీఎల్‌లో మరింత ప్రభావవంతంగా ఆడేందుకు తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు.
నాకేం సంబంధం లేదు.. అన్నీ అతడే...
"ప్రస్తుతం బ్యాటర్లు మరింత ధైర్యంగా ఆడుతున్నారు. సరైన క్రికెట్ షాట్లతోనే భారీ స్ట్రోక్స్ కొట్టగలరని నమ్ముతున్నారు. అదే సమయంలో, వారి షాట్ ఎంపికలో వైవిధ్యం చుపుతూ మరింత మెరుగుపరుచుకుంటున్నారు. ఫాస్ట్ బౌలర్లపై రివర్స్ స్కూప్, పైసర్ పై స్వీప్ లేదా రివర్స్ స్వీప్ ఆడుతున్నారు. నేను కూడా ఈ మార్పులకు అతీతం కాదు. నేనూ అలవాటు పడాలి. నేను బ్యాటింగ్ చేసే స్థానానికి అనుగుణంగా నా ఆటను మార్చుకోవాలి. ఆటలో కొనసాగాలంటే, కొత్త శైలిని అలవరచుకోవాల్సిందే. అలానే ఇంకో నిజమేంటంటే.. మా జట్టులో 99 శాతం తీసుకునే నిర్ణయాలు రుతురాజ్‌వే. నేను వెనకుండి ఏమీ చేయను. కేవలం ఏమైనా సాయం చేయమంటేనే ఆ సమయానికి చేస్తాను. ప్లేయర్స్ ను అతడు అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడు." అని ధోనీ పేర్కొన్నాడు.

చాలా మార్పులొచ్చాయి..
ఐపీఎల్ 2008తో పోలిస్తే ప్రస్తుతం ఐపీఎల్ 2025కి చాలా మార్పులు వచ్చాయని అన్నాడు ధోనీ. నేను 2008లో టీ20 ఆడినప్పుడుతో పోలిస్తే.. గతేడాది ఐపీఎల్ ఆడటానికి చాలా తేడా ఉంది. అప్పుడు వికెట్లు టూ పేస్డ్ గా ఉండేవి. పిచ్ పై బంతి బాగా తిరిగేది. కానీ ఇప్పుడు అలా లేదు. బ్యాటర్లకు బాగా అనుకూలంగా ఉంది. అని చెప్పుకొచ్చాడు.
మా మధ్య నమ్మకమైన బంధం..
విరాట్ కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడాడు ధోనీ. ఎవరి మధ్య అయినా సరే నమ్మకం అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. తామిద్దరి మధ్య అది ఉందని అన్నాడు. "కోహ్లీ సంతృప్తిపడే వ్యక్తి కాదు. క్రీజులో ఎక్కువ సేపు ఉండి పరుగుల వరద పారించాలనుకుంటాడు. బ్యాటింగ్ లో బాగా మెరుగయ్యాడు. ఫిట్ నెస్ అద్భుతం. అతడు నా దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే నిజాయతీగా అభిప్రాయం చెబుతాను. మా ఇద్దరి మధ్య నిజాయతీగల, నమ్మకమైన బంధం ఉంది. మొదట ఓ కెప్టెన్-యంగ్ ప్లేయర్ కు మధ్య ఉన్న బంధం మా మధ్య ఉండేది. ఆ తర్వాత మేం స్నేహితులుగా మారాం. ఇప్పుడు కూడా మేం మా ఆలోచనలను, మనసులోని మాటలను షేర్ చేసుకుంటాం. అలానే ఓ సీనియర్, జూనియర్ అనే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. ఇప్పడు మేమిద్దరంలో ఎవరూ కెప్టెన్ కాదు. అందుకే మ్యాచులకు ముందు మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతోంది." అని మహీ పేర్కొన్నాడు.