ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలుపెట్టాయి. వేలంలో భారత ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఈ ముగ్గురు కోసం కాసుల వర్షం కురువడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిషభ్ పంత్‌ను చెన్నై సూపర్ కింగ్ దక్కించుకుంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ధోనీతో కలిసి పంత్ ఎల్లో జెర్సీ ధరించనున్నాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా పరోక్షంగా పేర్కొన్నాడు. ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సీఎస్కేకు శాశ్వత వికెట్ కీపర్ అవసరం. ఆ స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా విధ్వంసకర బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పంత్ జట్టుకు సమతూకం తీసుకోనిరాగలడు.

అయితే అసలు ప్రశ్న... సీఎస్కే దగ్గర మిగిలిన రూ.55 కోట్లతో పంత్‌ను దక్కించుకోగలదా? పంత్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి మరో 19 మందిని కొనుగోలు చేయగలదా? కాగా, మెగా వేలంలో పంత్‌ను కొనుగోలు చేయడంపై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ వద్ద ఉన్న పర్స్ వ్యాల్యూ, ఇతర ఫ్రాంచైజీల నుంచి ఉండే పోటీ దృష్ట్యా పంత్‌ను కొనుగోలు చేయలేమని పేర్కొన్నాడు. అయితే పంత్ కోసం పోటీలోకి వస్తామని, కానీ దక్కించుకుంటామని చెప్పలేమని తెలిపాడు.
''రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, మతీష పతిరనాలను రిటైన్ చేయాలని నిర్ణయించుకోవడం సులువైనదే. అయితే ఈ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే మా దగ్గర తక్కువ మొత్తం మిగిలుతుందని మాకు తెలుసు. ఈ క్రమంలో మెగా వేలంలోకి భారత అత్యుత్తమ ప్లేయర్లు వచ్చినప్పుడు వాళ్లను దక్కించుకోవడానికి ఇతర ఫ్రాంచైజీలతో పోటీ ఎదుర్కోలేమని మాకు తెలుసు. అయితే మేం అతని కోసం ట్రై చేస్తాం. కానీ సొంతం చేసుకుంటామని చెప్పలేను'' అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), మతీష పతిరనా (రూ. 13 కోట్లు), శివమ్ దూబె (రూ.12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్‌గా రుతురాజ్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే అతనిపై చెన్నై ఫ్రాంచైజీ భారీ మొత్తాన్ని వెచ్చించింది.