IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ ఓడింది. అన్ని విభాగాల్లో విఫలమైన చెన్నై జట్టు.. కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం అందుకుంది. పైగా సొంత గడ్డ చెపాక్ స్టేడియంలోనే సీఎస్కే హ్యాట్రిక్ ఓటమిని అందుకోవడం అభిమానులను గట్టిగా నిరాశపరిచింది.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసింది. శివమ్ దూబె (29 బంతుల్లో 31 నాటౌట్; 3×4) ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్యాన్ని కేకేఆర్.. కేవలం 10.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సునీల్ నరైన్ (3/13), వరుణ్ చక్రవర్తి (2/22), హర్షిత్ రాణా (2/16) చెన్నై జట్టును బోల్తా కొట్టించారు. నరైన్ (18 బంతుల్లో 44; 2×4, 5×6) బ్యాట్‌తోనూ చెలరేగి ఆడాడు.

59 బంతులు మిగిలి ఉండగానే..
అయితే ఈ మ్యాచులో రెండు రికార్డులు నమోదయ్యాయి. అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో బంతులు పరంగా ఇదే అతి పెద్ద విజయం. చెన్నై జట్టుపై కోల్‌కతా గెలుపొందాక ఇంకా 59 బంతులు మిగిలి ఉండటం గమనార్హం. గతంలో 2020లో ముంబయి ఇండియన్స్ 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు దాన్ని కేకేఆర్ బ్రేక్ చేసింది. కాగా, ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చరిత్ర సృష్టించిన ధోనీ..
ఈ ఐపీఎల్ సీజన్ లో ధోనీ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా (43 సంవత్సరాల 278 రోజులు) వ్యవహరించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. గతంలో తన పేరిటే ఉన్న రికార్డునే (41 ఏళ్లు)ను అతడు బ్రేక్ చేయడం విశేషం.