IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్నిఖరారు చేసుకుంది. ఓటమితో పాటు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ఆటగాడికి భారీ జరిమానా విధించబడింది. ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు, ఫిట్టింగ్‌లను దుర్వినియోగం చేయడానికి సంబంధించిన ఆర్టికల్ 2.2 కింద లెవెల్ 1 ఉల్లంఘనకు ముఖేష్ కుమార్‌కు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇవ్వబడింది.
బుధవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్ చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన 4వ జట్టుగా నిలిచింది. గతంలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు అర్హత సాధించాయి. "ముఖేష్ కుమార్ ఐపీఎల్ ఆర్టికల్ 2.2 లెవెల్ 1 ఉల్లంఘనను అంగీకరించారు."అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రవర్తన నియమావళి మొదటి స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయం చెల్లుతుంది. బుధవారం ముఖేష్ కుమార్ తన 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ చివరి ఓవర్లో 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగులు వచ్చాయి.

అంతకుముందు ఢిల్లీ ఓటమి తర్వాత ప్రధాన కోచ్ హేమాంగ్ బదానీ మాట్లాడుతూ.. సీజన్ అంతటా ఓపెనర్లను కనుగొనలేకపోవడం జట్టు వైఫల్యానికి ఒక కారణమని అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో ఏడు ఓపెనింగ్ జంటలను ప్రయత్నించింది కానీ పెద్దగా విజయం సాధించలేదు. ఇప్పుడు ఆ జట్టు శనివారం తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది.