రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు. గురువారం లోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్. ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.
అయితే నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు అన్ని దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. అయితే స్టార్లకు ఎప్పటిలానే మెగా వేలం-2025లోనూ డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి కొందరు కుర్రాళ్లపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. స్టార్లకు పోటీగా యువకులపై భారీ ధర వెచ్చించాలని ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి. రిటైన్డ్ కానీ ఈ యువకులకు భారీ డిమాండ్ ఉండనుంది. వాళ్లు ఎవరెవరంటే..
తుషార్ దేశ్‌పాండే
ముంబైకి చెందిన తుషార్ దేశ్‌పాండే 2020లో ఐపీఎల్‌లోకి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2022లో మెగా వేలంలో తుషార్‌ను సీఎస్కే కనీస ధర రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. 2023 సీజన్‌లో 21 వికెట్లతో సత్తాచాటాడు. గత సీజన్‌లోనూ 17 వికెట్లతో ఆకట్టుకున్నాడు. పవర్‌ప్లేలో పాటు డెత్ ఓవర్లలో ఈ కుర్రాడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. అంతేగాక బ్యాటును కూడా ఝుళిపించగలడు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో తుషార్ అరంగేట్రం చేయడంతో సీఎస్కే నేరుగా రిటైన్ చేసుకోవాలనుకోవట్లేదు. ఈ నేపథ్యంలో తుషార్‌కు వేలంలో భారీ డిమాండ్ దక్కే అవకాశం ఉంది.
రసిక్ దర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ రసిక్ దర్ ఈసారి వేలంలో వచ్చే అవకాశం ఉంది. రసిక్ దర్‌పై కీలక ఫ్రాంచైజీలు కన్నేశాయి. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ రసిక్ క్రమంగా గుర్తింపు పొందుతున్నాడు. ఇటీవల జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లోనూ నిలకడగా ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతను 9 వికెట్లు సాధించాడు. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ అతని నైపుణ్యానికి ఫ్రాంచైజీలు ఫిదా అవుతున్నాయి.
సాయి కిశోర్
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి కిశోర్ 2022 మెగా వేలంలోనే రూ.3 కోట్ల ధర పలికాడు. వచ్చే 2025 మెగా ఆక్షన్‌లో కిశోర్ రికార్డు ధర సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ ఐపీఎల్‌లో 10 మ్యాచ్‌లే ఆడాడు. 13 వికెట్లు తీశాడు. అయితే ప్రధాన బ్యాటర్లు లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్ చేతిలో తడబడుతుండటంతో ఈ ప్లేయర్‌కు డిమాండ్ పెరుగుతోంది.
రమణ్‌దీప్ సింగ్
ఆల్‌రౌండర్ రమణ్‌దీప్‌ను రిటైన్ చేసుకోవాలని కేకేఆర్ విపరీతంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రధాన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో రమణ్‌దీప్‌ను రిలీజ్ చేస్తోంది. అయితే రమణ్‌దీప్ భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే ఆకట్టుకోవడమే కాకుండా రమణ్‌దీప్ గొప్ప ఫీల్డర్. ఫినిషర్‌గా, విధ్వంసకర బ్యాటర్‌గా రమణ్‌దీప్‌కు గుర్తింపు ఉంది.