దాదాపుగా కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకుని ఫ్రాంచైజీలన్నీ సంతోషంగానే ఐపీఎల్ మెగా వేలాన్ని ముగించాయి. అయితే ఎప్పటిలాగానే ఆర్సీబీ మేనేజ్మెంట్‌పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. వేలంలో తమ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయాలపై బెంగళూరు అభిమానులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఫ్రాంచైజీల కంటే అధిక మొత్తాన్ని ఎందుకు ఉంచుకున్నారు? ఆర్‌టీఎమ్‌లను పూర్తిస్థాయిలో ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, జియో సినిమా నిపుణుల కమిటీ సైతం అత్యంత చెత్త వ్యూహాలు అమలు చేసిన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రేటింగ్ ఇచ్చింది. అన్ని ఫ్రాంచైజీల కంటే ఆర్సీబీ వద్ద ఎక్కువ డబ్బు మిగిలడం విశేషం. రూ. 75 లక్షలు తమ పర్స్‌లోనే ఉన్నాయి. అలాగే రెండు ఆర్‌టీఎమ్‌లను బెంగళూరు ఫ్రాంచైజీ ఉపయోగించలేదు. అయితే ఆర్సీబీ ఎదుర్కొనే ప్రధాన విమర్శ.. సిరాజ్, మ్యాక్స్‌వెల్, విల్ జాక్స్, డుప్లెసిస్‌లకు ఆర్‌టీఎమ్ ఎందుకు ఉపయోగించలేదు.

గత కొంతకాలంగా ఆర్సీబీ తరఫున మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియం గురించి ఎంతో అవగాహన ఉంది. పరిస్థితులను బట్టి ప్రత్యర్థికి కళ్లెం వేసేలా వ్యూహాలు రచించగలరు. కానీ ఈ ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రయత్నమే చేయలేదు. మ్యాక్సీ మినహా సిరాజ్, డుప్లెసిస్ గత సీజన్లలో నిలకడగానే ప్రదర్శన చేశారు. వారిద్దరిని సైతం బెంగళూరు ఫ్రాంచైజీ తీసుకోకపోవడం గమనార్హం.
ఈ ఏడాది సీజన్‌లో విల్ జాక్స్ సెంచరీతో సత్తాచాటి భవిష్యత్ తారగా గుర్తింపు పొందాడు. కానీ అతన్ని కూడా ఆర్సీబీ దక్కించుకోలేదు. ఈ నలుగురు వేలంలో భారీ ధర కూడా పలకలేదు. సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు గుజరాత్, మ్యాక్సీని పంజాబ్ రూ.4.20 కోట్లకు, డుప్లెసిస్‌ను కనీస ధర రూ.2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్, విల్ జాక్స్‌ను రూ.5.25 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆర్‌టీఎమ్‌ను ఉపయోగిస్తానంటూ బెదిరించి ప్రత్యర్థి ఫ్రాంచైజీ పర్స్ నుంచి కాస్త మొత్తాన్ని కూడా ఆర్సీబీ ఖాళీ చేయించలేదు. మాకు ఆ ప్లేయర్లు అవసరం లేదని అప్పనంగా అప్పగించేసింది.
గత వేలంలో హేజిల్‌వుడ్ మాకొద్దని చేతులు జోడించి తిరస్కరించిన ఆర్సీబీ.. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా పేసర్ తిరిగి దక్కించుకుంది. హేజిల్‌వుడ్ కోసం రూ.12.50 కోట్లు వెచ్చించింది. హేజిల్‌వుడ్‌తో పోలిస్తే సిరాజ్ ఎంతో మెరుగైన సామర్థ్యం కలిగిన ఆటగాడు. అంతేగాక భారత స్టార్ ప్లేయర్లు ఉండటం జట్టుకు ఎంతో కలిసొస్తుంది. కానీ ఆర్సీబీ భిన్నమైన వ్యూహాలతో కీలక ప్లేయర్లను వదిలేసింది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాకముందే బెంగళూరు ఫ్రాంచైజీని విమర్శించడం సరికానప్పటికీ.. ఆర్సీబీ మేనేజ్మెంట్‌ను తిట్టడంలో తప్పులేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.