ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది ఓవర్సీస్ ప్లేయర్లతో సహా 21 మందిని సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కంటే తక్కువ మందిని సొంతం చేసుకున్న ఫ్రాంచైజీ ఇదే.
టైటిల్‌ను గెలిపించిన జట్టులోని ఆటగాళ్లను ఎక్కువ మొత్తంలో తమ ఫ్రాంచైజీలో కొనసాగించాలనే ఉద్దేశంతో రిటెన్షన్, వేలంలోనూ కేకేఆర్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో తమ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23.75 కోట్లు వెచ్చించింది. ఆర్సీబీతో హోరాహోరీగా పోటీపడి దక్కించుకుంది. వేలంలో వాళ్లు సొంతం చేసుకున్న ఆటగాళ్లలో బౌలర్ నోకియా రెండో అత్యధిక ధర రూ.6.50 కోట్లు పొందాడు. ఇది వెంకటేశ్‌కు వెచ్చించిన మొత్తంలో దాదాపు కేవలం నాలుగో వంతు మాత్రమే.

ఇక వేలంలో కోల్పోయిన ఫిలిప్ సాల్ట్ స్థానంలో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ను తీసుకున్నారు. యువ బ్యాటర్ రఘవంశీని తిరిగి దక్కించుకున్నారు. వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌ను రూ.1.50 కోట్లకే సొంతం చేసుకున్నారు. స్టార్క్ స్థానాన్ని భర్తీ చేసేలా నోకియా, స్పెన్సర్ జాన్సన్‌లను వేలంలో కొనుగోలు చేశారు. స్పిన్ బాధ్యతలను వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లతో పాటు మొయిన్ అలీ, మయాంక్ మార్కండే పంచుకునేలా జట్టును సిద్ధం చేశారు. సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానె, మనీష్ పాండేను ఫ్రాంచైజీలోకి ఆహ్వానించారు.
అయితే జట్టును సిద్ధం చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ విషయాన్ని మరిచింది. సారథి బాధ్యతలను నిర్వర్తించే ఆటగాళ్లను సొంతం చేసుకోవడంలో తడబడింది. గత సీజన్‌లో జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన విషయం తెలిసిందే. అయితే అతన్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.వైస్ కెప్టెన్‌గా, స్టాండ్‌బై కెప్టెన్‌గా కేకేఆర్‌ను గతంలో నడిపించిన నితీశ్ రాణాను కూడా సొంతం చేసుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో కోల్‌కతాకు కొత్త కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువ మొత్తాన్ని దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు సారథి బాధ్యతలు అప్పగిస్తారా? లేదా ఆఖర్లో కనీస ధరతో కొనుగోలు చేసిన అజింక్య రహానెకు జట్టు పగ్గాలు అందిస్తారా? రహానెకు అనుభవం ఉన్నప్పటికీ, అతను తుదిజట్టులో ఉంటాడనేదే ప్రశ్నార్థకం.
కోల్‌కతా నైట్ రైడర్స్
వెంకటేశ్ అయ్యర్ (23.75), రింకు (13), వరుణ్ (12), నరైన్ (12), రసెల్ (12), నోకియా (6.50), హర్షిత్, రమణ్‌దీప్ (4), డికాక్ (3.60), రఘువంశీ (3), స్పెన్సర్ (2.80), గుర్బాజ్, మొయిన్ అలీ (2), వైభవ్ (1.80), రహానె, పావెల్ (1.50), ఉమ్రాన్ మలిక్, మనీశ్ పాండే (0.75), అనుకుల్ (0.40), లవ్‌నిత్, మార్కండె (0.30).