ఐపీఎల్ మెగా వేలం-2025 నిబంధనలు ఖరారయ్యాయి. ఒక ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగిస్తూ గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునేలా బీసీసీఐ రూల్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం నిబంధనలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో సమావేశం జరగనుంది.
బీసీసీఐ సంబంధిత వర్గాల ప్రకారం.. అయిదుగురు ప్లేయర్లను నేరుగా రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అంతేగాక ఒక ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగించుకోవడానికి వెసులుబాటు ఇవ్వనున్నారు. తొలుత నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునేలా నిబంధనలను రూపకల్పన చేశారు. కానీ కొన్ని ఫ్రాంచైజీలు తమ బ్రాండ్ వ్యాల్యూ కోల్పోకుండా రూల్స్ ఖరారు చేయాలని ఒత్తిడి చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నిబంధనలు.. కొత్తగా జట్టును నిర్మించుకోవాలని, జట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావించే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ వంటి ఫ్రాంచైజీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో జరిగిన సమావేశంలో ఈ ఫ్రాంచైజీలు నలుగురునే రిటైన్ చేసుకునే నిబంధనకే మద్దతు ఇచ్చాయి.
అయితే రిటెన్షన్ ప్రక్రియలో ఆయా ఫ్రాంచైజీలు తమ మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ స్టార్స్, అనామక ప్లేయర్లను కూడా భాగం చేయాల్సి ఉంటుంది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 రిటెన్షన్ పాలసీ గురించి బీసీసీఐ పూర్తి స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు ఐపీఎల్ వేలం జరగనున్న వేదిక గురించి కూడా ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది. గతేడాది వేలాన్ని నిర్వహించిన తరహాలోనే ఈసారి కూడా భారత్ వెలుపలే మెగా ఆక్షన్ నిర్వహించాలని భావిస్తున్నారు. సౌది అరేబియా వేదికగా మెగా వేలం జరిగే అవకాశం ఉంది. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్‌లో మెగా ఆక్షన్ జరగనుంది.