Gujarat Titans: ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు.
ప్రత్యేకించి- గుజరాత్ టైటాన్స్‌లో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. 2022లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు అది. ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. ఆ మరుసటి ఏడాది కూడా అదే స్థాయిలో సత్తా చాటింది. ఫైనల్స్ వరకూ చేరినా దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది.

ఈ సీజన్‌లో మాత్రం చతికిల పడిందా టీమ్. లీగ్స్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లల్లో గెలిచింది అయిదింట్లోనే. రెండు రద్దయ్యాయి. 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ సీవీసీ కేపిటల్స్.. భారీగా మార్పులు చేర్పులకు తెర తీసినట్టే కనిపిస్తోంది.
ఇందులో భాగంగా తొలి వేటు హెడ్ కోచ్‌పై వేయటం ఖాయమైనట్టే. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాల ఆశీష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం..ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

మెగా వేలం పాట కంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదు. జట్టు ఆవిర్భావం నుంచి అంటే 2022 నుంచీ హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు ఆశీష్ నెహ్రా. కోచ్‌తో పాటు కొందరు ప్లేయర్లను కూడా తొలగించవచ్చని చెబుతున్నారు. ఈ జాబితాలో కొందరు విదేశీ ప్లేయర్లు కూడా ఉండొచ్చు.
ఆశీష్ నెహ్రాను తొలగించాల్సి వస్తే ఆ స్థానాన్ని గ్యారీ కిర్‌స్టెన్‌తో భర్తీ చేయవచ్చని స్పోర్ట్స్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ అంచనా వేసింది. ప్రస్తుతం కిర్‌స్టెన్ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా వ్యవహరిస్తోన్నాడు ఇదే టీమ్‌కు. ఆయనకు హెడ్ కోచ్‌గా ప్రమోషన్ కల్పించవచ్చని తెలిపింది. టీమ్ డైరెక్టర్‌గా ఉన్న విక్రమ్ సోలంకిని బ్యాటింగ్ కోచ్‌గా అపాయింట్ చేయవచ్చని పేర్కొంది.