IPL 2025: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌లలో ఐపీఎల్ ఒకటి. ఈ లీగ్ గత కొన్ని సీజన్లలో సిక్సర్ల మోత మోగుతోంది. ఐపీఎల్‌లో సిక్సర్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ లీగ్ చరిత్రలో ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు చాలా మంది ఉన్నారు. కానీ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ బ్యాటర్ ఎవరో మీకు తెలుసా?
ప్రతి ఏడో బంతికి సిక్స్ కొట్టిన ఆడగాడు
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లను పరిశీలిస్తే క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ లీగ్‌లో గేల్ అత్యధికంగా 357 సిక్సర్లు కొట్టాడు. కానీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతి తక్కువ బంతుల్లో సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మాత్రం గేల్ పేరు మొదటి స్థానంలో కనిపించదు. ఈ జాబితాను పరిశీలిస్తే ఆండ్రీ రస్సెల్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆండ్రీ రస్సెల్ తన ఇన్నింగ్స్‌లోని దాదాపు ప్రతి ఏడో బంతికి సిక్స్ కొట్టాడు. ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్ బంతుల పరంగా సిక్సర్లు కొట్టే ఫ్రీక్వెన్సీ 6.8. అంటే 6.8 బంతులకు ఒక సిక్స్ బాదాడన్నమాట.

జాబితాలో నికోలస్ పూరన్-సునీల్ నరైన్ కూడా..
ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్ నికోలస్ పూరన్ పేరు కూడా ఉంది. నికోలస్ పూరన్ తన ఇన్నింగ్స్ లోని దాదాపు ప్రతి 8వ బంతికి సిక్స్ బాదాడు. పూరన్ తర్వాత సునీల్ నరైన జాబితాలో తర్వాత స్థానంలో ఉన్నాడు. సునీల్ నరైన్ తన ఇన్నింగ్స్‌లోని ప్రతి 9 లేదా 10వ బంతికి సిక్స్ బాదుతాడు. ఈ జాబితాలో తదుపరి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ రికార్డు నరైన్ రికార్డుకు దగ్గరగా ఉంది. ఆ తర్వాత ఈ జాబితాలో కీరన్ పొలార్డ్ ఉన్నాడు. కీరన్ పొలార్డ్ సిక్సర్లు కొట్టే ఫ్రీక్వెన్సీ దాదాపు 10.4 బంతులు. అంటే పొలార్డ్ తన ఇన్నింగ్స్‌లోని ప్రతి 10 లేదా 11వ బంతికి సిక్స్ కొట్టేవాడు. జాబితాలో తదుపరి స్థానంలో శివం దుబే 10.6 ఫ్రీక్వెన్సీతో ఉన్నాడు. దీని అర్థం శివం దుబే రికార్డు పొలార్డ్ రికార్డుకు దగ్గరగా ఉంది.
ఎక్కువ సిక్సర్లు ఎవరు బాదారు?
అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ 357 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఏబీ డివిలియర్స్(251 సిక్సర్లు) ఉన్నాడు. ఇది కాకుండా కీరన్ పొలార్డ్ 223 సిక్సర్లు కొట్టాడు. రస్సెల్ 212 సిక్సర్లతో ఈ జాబితాలో ఉన్నాడు.