IPL 2025 Rajasthan Royals: ఐపీఎల్ 2025లో అత్యంత దురదృష్టకరమైన జట్టు అంటే రాజస్థాన్ రాయల్స్. గెలుపు ముంగిట వరకు వస్తూ బోల్తా కొడుతోంది. చేతిదాకా వచ్చిన విజయాలు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా వరుసగా గత రెండు మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆరు మ్యాచుల్లో ఓడి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati rayudu) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇదేం ఛారిటీ కాదు కదా..
"రాజస్థాన్ రాయల్స్ విషయంలో ఎప్పుడూ నాకొక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. వాళ్లు ఎన్నో ఏళ్లుగా ఎందుకు యంగస్టర్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్లు ఏం సాధించారు? 17 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. పైగా యంగ్ స్టర్స్ ఉండటమే తమ జట్టు బలమని ఎప్పుడూ చెప్పుకుంటుంటారు. ఇదేం ఛారిటీ కాదు కదా. ఇక్కడికీ పోటీ పడటానికి వచ్చాం."

మంచిదే కానీ.. దానిపై కూడా దృష్టి పెట్టాలి..
"మీరు ఇక్కడ ఉన్నది ఐపీఎల్ టైటిల్ గెలవడానికి. ఐపీఎల్ టైటల్ గెలవడానికి జట్లకు కొన్ని విధానాలు ఉన్నాయి. వాటిలో ఏదీ మీరు అనుసరించడం లేదు. ఐపీఎల్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్లకు మీరు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ, అదే సమయంలో మీరు విజయాలపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది కదా" అని రాయుడు అన్నాడు.
సమర్థించిన మరో మాజీ ప్లేయర్..
రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలకు సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కూడా సమర్థించాడు. "ఏ ఫ్రాంఛైజీకైనా ఇదే వర్తిస్తుంది. ఐపీఎల్ అనేది ప్రతిభను తయారు చేసే వేదిక కాదు అని నా అభిప్రాయం. ఇది పూర్తిస్థాయి ఆట ఆడే ఆటగాళ్ల కోసం ఉన్న వేదిక." అని పేర్కొన్నాడు.
కాగా, రాజస్థాన్ రాయల్స్.. యువ ప్రతిభకు అవకాశాలు కల్పించే ఫ్రాంఛైజీల్లో ముందుంటుంది. అజింక్య రహానే, సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్ వంటి ఆటగాళ్లు ఇలా వచ్చినవారే. అయితే, ఈ సీజన్ మెగా వేలానికి ముందు ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్‌లను రిటైన్ చేయడంపై విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్టే వారు కూడా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.